కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అంతా సిద్ధం
07 April 2022, 7:03 IST
- ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 11న కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రులంతా గురువారం (నేడు) మధ్యాహ్నం జరిగే క్యాబినెట్ భేటీలో పాల్గొని రాజీనామాలు సమర్పించనున్నారు. కొద్దిమందికి మినహా.. మిగిలిన జట్టును పూర్తి స్థాయిలో మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
క్యాబినెట్ విస్తరణపై భేటీ
AP Cabinet Reshuffle | ఏపీ కొత్త క్యాబినెట్ విస్తరణకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం క్యాబినేట్ భేటీ జరగబోతుంది. ప్రస్తుత మంత్రులంతా... భేటీలో పాల్గొని తమ రాజీనామాలను సమర్పించనున్నారు. వీరిలో ఎవరి స్థానం పదిలమనే భరోసా ఎవరిలోను లేదు. మంత్రి వర్గ కూర్పు, ఏర్పాటు మొత్తం ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం కానుంది.
గంపెడు ఆశలతో ఎదురుచూపులు..
ఈ క్రమంలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై సీనియర్లతో పాటు.. తొలిసారి ఎన్నికైన వారు సైతం గంపెడాశలు పెట్టుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేసి.. ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారు కూడా గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే తొలిమంత్రి వర్గంలోనే తమకు చోటు దక్కుతుందని భావించినా అలా జరగలేదు. కాబట్టి ఈసారైనా తమ ఆశలు నెరవేరతాయనే భావిస్తున్నారు. సీనియర్లలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణకు మినహా ఎవరికి మంత్రి పదవిని జగన్ కేటాయించలేదు.
ఏ క్లూ కూడా బయటకు రానివ్వట్లే..
కొత్త మంత్రి వర్గ ఏర్పాటు, ఎవరెవరికి స్థానం కల్పించాలి.. అనే విషయంలో ఇప్పటి వరకు సీనియర్లు ఎవరితోనూ ముఖ్యమంత్రి చర్చలు జరపలేదని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి మనసులో ఏముందనే విషయం బయటకు పొక్కితే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశంతో కొత్త మంత్రుల పేర్లను బయటకు రానివ్వలేదని తెలుస్తుంది. తొలి మంత్రి వర్గ ఏర్పాటు సమయంలో రకరకాల కారణాలతో కొందరికి స్థానం కల్పించాల్సి వచ్చిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా.. ముందే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ పర్యటన అందుకేనా..?
గతంలో ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి విషయంలో.. ఓ జాతీయ పార్టీ ముఖ్య నాయకుడి సిఫార్సును అంగీకరించాల్సి వచ్చిందని.. తెలంగాణలోని ఓ ముఖ‌్యనాయకుడి సిఫార్సుతో గోదావరి జిల్లాలో ఒకరికి మంత్రి పదవి కేటాయించారనే ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రంలోని భాజపాతో వైసీపీకి పొత్తు లేకున్నా.. కాషాయం అగ్రనేతలతో స్నేహానికి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
గవర్నర్తో భేటీ
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత మంత్రి వర్గ పునరవ్వ్యస్థీకరణ జరుగుతున్నట్లు వివరించారు. రాజ్‌భవన్‌లో అరగంట పాటు భేటీలో పాల్గొని.. కొత్త మంత్రివర్గ విస్తరణ గురించి గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగేవారు.. కొత్తవారి ఎంపికలో ప్రాధాన్యతలు గురించి తెలిపారు. ఈ భేటీలోనే ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు, త్వరలో చేపట్టబోయే కొద్ది పాటి మార్పులు, చేర్పులు కూడా చర్చకు వచ్చిన సమాచారం. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నేడు జరిగే చివరి క్యాబినెట్ భేటీలో మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నారు. పాత మంత్రుల రాజీనామాలు, ఆమోదించిన జాబితాను గవర్నర్‌కు సమర్పించనున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.
టాపిక్