Tirpuati Police: శ్రీకాళహస్తిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం… నదిలో దూకి కాపాడిన కానిస్టేబుల్
25 April 2023, 9:07 IST
- Tirpuati Police: వేర్వేరు వ్యక్తులతో పెళ్లైనా ప్రేమను మరిచిపోలేని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్వర్ణముఖి నదిలో దూకి ప్రాణాలను తీసుకోవాలనుకున్న జంటను కానిస్టేబుల్ కన్నయ్య రక్షించాడు.
ఆత్మహత్యాయత్నానిిక పాల్నడిన జంటను కాపాడిన పోలీసులు
Tirpuati Police: అర్థరాత్రి నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన జంటను తిరుపతి నైట్ బీట్ పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. వేరు వేరుగా జీవించడం ఇష్టంలేక, శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమ జంట పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు.
చిమ్మ చీకటిలో నదిలో దూకి నీటిలో మునిగిపోతున్న రెండు నిండు ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ కన్నయ్యరె జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి అభినందించారు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో విధి నిర్వహణలో భాగంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ కానిస్టేబుల్ కన్నయ్య అతనితో పాటు హోంగార్డు బీట్ తిరుగుతున్నారు.
అర్థరాత్రి సమయంలో డయల్ 100 నుండి ఓ సమాచారం వచ్చింది. స్వర్ణముఖి నది వంతెనపై నుండి ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారని సమాచారం రావడంతో అప్రమత్తం అయ్యారు. కానిస్టేబుల్ కన్నయ్య ఆలస్యం చేయకుండా వెంటనే ఘటన స్థలానికి చేరుకోవడంతో నదిలో ఇద్దరు మునిగిపోతున్నట్లు గుర్తించాడు.
చీకటిలో నది లోతు ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో కన్నయ్య వారి ప్రాణాలను కాపాడాలనే ఆలోచనతో వెంటనే నదిలో దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసుల బృందం తాడు సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు.
ప్రేమను మరువలేక, ప్రాణాలు తీసుకుందామని….
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బిందు శ్రీ (22), వేణు (26) కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబాల్లో ప్రేమను అంగీకరించకుండా వేరే పెళ్లిళ్లు చేశారు. బిందుశ్రీ వైవాహిక జీవితంలో అటుపోట్లు తలెత్తాయి. భర్తతో కలిసి జీవించలేక పుట్టింటికి వచ్చేసింది. వేణుకు కూడా నెల క్రితమే వివాహం జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకరినొకరు మరువలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ప్రాంతానికి అర్థరాత్రి 12:30 గంటల తర్వాత ఎవరు లేని సమయం చూసి నదిలో దూకేశారు. ఆ సమయంలో వారు నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ కానిస్టేబుల్ కన్నయ్య వారిని కాపాడారు. ప్రేమ జంటను కాపాడిన హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర, గిరిబాబు, మునీంద్రలను స్థానికులు అభినందించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించారు.