తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Electronic Cluster : తిరుపతి ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌లో పరిశ్రమలు ప్రారంభం

Electronic Cluster : తిరుపతి ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌లో పరిశ్రమలు ప్రారంభం

B.S.Chandra HT Telugu

17 September 2022, 9:32 IST

google News
    • భారతదేశం 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతులను చేరుకోవడానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి లిథియం బ్యాటరీ కర్మగారాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. 
తిరుపతి ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లో కేంద్రమంత్రి చంద్రశేఖర్‌
తిరుపతి ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లో కేంద్రమంత్రి చంద్రశేఖర్‌

తిరుపతి ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లో కేంద్రమంత్రి చంద్రశేఖర్‌

భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సందర్శించారు. భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కర్మాగారంలో గడపడంపై సంతోషం వ్యక్తం చేశారు. 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు.

అందరి భాగస్వామ్యంతో పారిశ్రామిక లక్ష్యాలను చేరుకోడానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్రాల సమన్వయంతో లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో మునోత్ ఇండస్ట్రీస్, భారతదేశపు మొట్టమొదటి లిథియం సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

శ్రీవేంకటేశ్వరుని నివాస స్థలం తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్‌ ఏర్పాటు కావడం భగవంతుని కృప అన్నారు. “2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని అధిగమించడమే లక్ష్యమని చెప్పారు. 25 లక్షల కోట్ల రూపాయలకు అది సమానం అని, 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 1.10 లక్షల కోట్లు మాత్రమే ఎగుమతులుగా ఉన్నాయని, లక్ష్య గణాంకాలు ఇప్పుడు ఉన్న దానికంటే 24 రెట్లు ఎక్కువ అని చెప్పారు.

ప్రభుత్వ చురుకైన విధానాలతో పాటు క్రమబద్దీకరించిన కార్యక్రమాలు ప్రతి స్టార్టప్‌కు, ప్రతి వ్యవస్థాపకుడికి దేశపు ఈ కలను సాకారం చేయడానికి తోడ్పడతాయని అన్నారు.లిథియం-అయాన్ ఫ్యాక్టరీ యొక్క వాణిజ్య ఉత్పత్తి అధికారిక ప్రారంభోత్సవం వచ్చే నెలలో జరగనుంది. ప్రస్తుతం ప్లాంట్ స్థాపిత సామర్థ్యం 270 Mwh‌తో రోజూ 10Ah సామర్థ్యం గల 20,000 సెల్‌లను ఉత్పత్తి చేయగలిగే విధంగా తయారైందని కేంద్ర మంత్రి చెప్పారు.

భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లు దిశానిర్దేశం చేస్తున్నాయని చంద్రశేఖర్ ప్రశంసించారు. “ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు వేగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆవిష్కరణలు ఉద్యోగాల సృష్టికి కేంద్రాలుగా మారుతున్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ క్లస్టర్లు భవిష్యత్తులో పెద్ద పాత్ర పోషిస్తాయని, యువతకు ఆసక్తిని కలిగించే ముఖ్యమైన రంగాలుగా ఉన్న డిజైన్ ఆవిష్కరణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రెండింటిలోనూ భారతదేశం నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలన్నారు.

చెన్నైకి చెందిన మునోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ. 165 కోట్లతో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ద్వారా టెంపుల్ టౌన్‌లో ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లలో ఒక దాంట్లో లిథియం బ్యాటరీ కర్మాగారం ఏర్పాటు చేశారు.

తదుపరి వ్యాసం