Tirumala : తిరుమల ఆలయం 8 గంటల పాటు మూసివేత, రేపు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు!
01 October 2023, 18:29 IST
- Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా అక్టోబర్ 2న ఎస్ఎస్డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. భక్తుల ఈ విషయాన్ని గమనించి తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 29న తిరుమల ఆలయాన్ని 8 గంటలు మూసివేయనున్నట్లు ప్రకటించారు.
తిరుమల
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో సోమవారం తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 2న సర్వదర్శనం స్లాట్ టోకెన్లు జారీ చేయడంలేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
8 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమల ఆలయ తలుపులు 8 గంటలకు పైగా మూసివేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 29న తిరిగి తెరుస్తామన్నారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుంచి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం రద్దు
అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.
అక్టోబర్ 2న ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు
పెరటాసి నెల రద్దీ కారణంగా అక్టోబర్ 2న ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తీర్థయాత్రను ప్లాన్ చేసుకోవాని టీటీడీ కోరుతుంది.
- అక్టోబర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
- అక్టోబర్ 4 - రోహిణి నక్షత్రం - శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఊరేగింపు
- అక్టోబర్ 6 - శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
- అక్టోబర్ 13 - శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
- అక్టోబర్ 14 - హస్తా నక్షత్రం - శ్రీ సూర్య నారాయణ స్వామి తిరుచ్చి
- అక్టోబర్ 15 నుంచి 24 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
- అక్టోబర్ 20 - శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
- అక్టోబర్ 24 - విజయదశమి - శ్రీ పద్మావతి అమ్మవారి గజ వాహన సేవ
- అక్టోబర్ 27- శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి
- అక్టోబర్ 31 - శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఊరేగింపు