Rohit Sharma In Tirumala : తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ రోహిత్ శర్మ, 2019 బ్యాటింగ్ రిపీట్ అంటున్న ఫ్యాన్స్!
13 August 2023, 16:50 IST
- Rohit Sharma In Tirumala : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో రోహిత్ వీడియో వైరల్ అవుతోంది.
తిరుమలలో రోహిత్ శర్మ
Rohit Sharma In Tirumala : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు రోహిత్ శర్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రోహిత్ దంపతులకు పండితులు ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తిరుమల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
2019 బ్యాటింగ్ రిపీట్ అవుతుందా?
తిరుమల శ్రీవారిని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో భార్య, కూతురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం భార్యా పిల్లలతో కలిసి రోహిత్ బయటకు వచ్చిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 2019 ప్రపంచ కప్ ముందు కూడా రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ ఏడాది వరల్డ్ కప్‌లో రోహిత్ బ్యాటింగ్ లో అదరగొట్టారు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 648 పరుగులు చేశారు. ఈ ఏడాది కూడా వన్డే ప్రపంచ కప్ ఉండడంతో రోహిత్ శర్మ మళ్లీ బ్యాట్ తో విజృంభిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్ ముగిశాక.. రోహిత్ ఇండియా తిరిగి వచ్చారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ జరగనుంది. మరికొద్ది రోజుల్లో రోహిత్ శర్మ జట్టుతో జాయిన్ అవుతాడు. ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును త్వరలో బీసీసీఐ ప్రకటించనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్
క్రికెటర్ రోహిత్ శర్మ ఆసియా కప్ కు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. టీమిండియా తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబరు 2న క్యాండీలో పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌ను గెలవడానికి భారత్ ఫేవరెట్‌లలో ఒకటిగా ఉంది. కొందరు ప్లేయర్స్ కు గాయాల కారణంగా బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది.