తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్- ఈ నెల 10న ఎస్ఈడీ, శ్రీవాణి, గదుల కోటా టికెట్లు విడుదల

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్- ఈ నెల 10న ఎస్ఈడీ, శ్రీవాణి, గదుల కోటా టికెట్లు విడుదల

08 November 2023, 16:47 IST

google News
    • Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రూ.300 ఎస్ఈడీ టికెట్లు, శ్రీవాణి దర్శనం టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న విడుదల చేయనున్నారు.
తిరుమల
తిరుమల

తిరుమల

Tirumala : డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. 2.25 ల‌క్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లను నవంబర్ 10వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుంచి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు న‌వంబ‌రు 9వ తేదీ గురువారం అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్సవం, యాగ‌శాల‌లో అంకురార్పణ కార్యక్రమాలు చేప‌డ‌తారు.

న‌వంబ‌రు 10న ధ్వజారోహ‌ణం

ఆలయంలో న‌వంబ‌రు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మ‌ధ్య ధనుర్ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి.

వాహనసేవల వివరాలు :

  • 10-11-2023 – ధ్వజారోహణం, చిన్నశేషవాహనం.
  • 11-11-2023 – పెద్దశేషవాహనం, హంసవాహనం.
  • 12-11-2023 – ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం.
  • 13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం.
  • 14-11-2023 – పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్సవం, గజవాహనం.
  • 15-11-2023- స‌ర్వభూపాల వాహ‌నం, స్వర్ణరథం, గరుడవాహనం.
  • 16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.
  • 17-11-2023 – రథోత్సవం, అశ్వ వాహనం.
  • 18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం.

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 7వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

తదుపరి వ్యాసం