Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి మరో నెయ్యి, 50 ఏళ్ల నందిని నెయ్యి బంధానికి బ్రేక్
31 July 2023, 16:06 IST
- Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందని నెయ్యిని వినియోగించరు. దీంతో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ
Tirumala Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసారం చాలా ఫేమస్. తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఈ లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు చాలా ఇష్టం. తిరుమల లడ్డూ తయారీకి గత 50 ఏళ్లుగా కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్ నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఇకపై శ్రీవారి లడ్డూ తయారీలో ఈ నెయ్యి వాడకం నిలిచిపోయింది. లడ్డూ తయారీకి పంపే నాణ్యమైన నందిని నెయ్యిని ఇకపై సరఫరా చేయలేమని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు.
నెయ్యి టెండర్ వేరే కంపెనీకి
తిరుమల లడ్డూలకు ఇకపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నిర్వహిస్తున్న నందిని డెయిరీ నెయ్యి సరఫరా చేయడంలేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ తెలిపారు. నందిని పాల ఉత్పత్తుల ధరల పెంపు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి టెండర్‌ను వేరే కంపెనీకి అప్పగించింది. బళ్లారిలో భీమా నాయక్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో నెయ్యి ధరలు కూడా పెరగనున్నాయి. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించేందుకు కొత్త కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసిందన్నారు. అందుకే చాలా ఏళ్ల తర్వాత టీటీడీకి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. నందిని నెయ్యి ప్రపంచ ప్రమాణాలతో తయారు చేస్తున్నామని భీమా నాయక్ తెలిపారు. ఇతర బ్రాండ్ల నెయ్యి నందిని నెయ్యి నాణ్యతతో సరిపోలడం లేదని ఆయన అన్నారు.
నందిని పాల ధర పెంపుతో
“నందిని నెయ్యితో తయారయ్యే లడ్డూలు ఇక ఉండవని అనుకుంటున్నాను. నందిని మార్కెట్‌లో అత్యుత్తమ నెయ్యిని అందజేస్తుంది. అన్ని నాణ్యతా తనిఖీల్లో నందిని నెయ్యిను పరీక్షిస్తారు. ఏదైనా బ్రాండ్ నందిని కంటే తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తే, నాణ్యత రాజీ పడుతుందని నేను భావిస్తున్నాను ”అని KMF అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. దాదాపు 50 ఏళ్లుగా తిరుమల లడ్డూలను తయారు చేసేందుకు నందిని నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. శ్రీవారిని దర్శించుకునే భక్తులు.. తప్పనిసరిగా లడ్డూలు స్వీకరిస్తారు. తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం. లడ్డూలను శ్రీవారికి నైవేద్యంగా పరిగణిస్తారు భక్తులు. ఇది సాధారణంగా భక్తులు ఇంటికి తీసుకువెళ్లే శ్రీవారి ప్రసాదం. కర్ణాటక మంత్రివర్గం.. నందిని పాల ధర లీటరుకు రూ.3 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.39 ధర ఉండే [టోన్డ్] పాలను ఆగస్టు 1 నుంచి లీటరుకు రూ.42కు విక్రయించనున్నారు. మిగతా చోట్ల లీటరుకు రూ.54-రూ.56 మధ్య విక్రయిస్తారు. తమిళనాడులో లీటరు పాల ధర రూ.44గా ఉందని అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.