Tirumala Tickets Offline Booking : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్ లైన్ లో పొందడం ఎలా?
26 March 2024, 19:59 IST
- Tirumala Tickets Offline Booking : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను ఆఫ్ లైన్, ఆన్ లైన్ మోడ్ లో టీటీడీ అందిస్తుంది. అయితే సర్వదర్శనం టికెట్లు మాత్రమే ఆఫ్ లైన్ లో జారీ చేస్తారు. ఆఫ్ లైన్ లో టికెట్లు ఎలా పొందాలో తెలుసుకుందాం.
శ్రీవారి దర్శనం టికెట్లు
Tirumala Tickets Offline Booking : తిరుమల శ్రీవారి దర్శనానికి(Tirumala Darshan) నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని భావిస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ (TTD)ముందుగానే ఆన్ లైన్ టికెట్లు(Online Tickets) జారీ చేస్తుంది. దీంతో పాటు ఆఫ్ లైన్ సర్వదర్శనం(Sarvadarshan Tickets) టికెట్లు జారీ చేస్తుంది. నిత్యం కాలినడకన వచ్చే భక్తులకు ఉచితంగా సర్వదర్శనం టికెట్లు అందజేస్తుంది.
తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం ఆఫ్‌లైన్ టికెట్ల బుకింగ్
తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం ఆఫ్‌లైన్ టికెట్ల సదుపాయాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చు. అయితే ఉచిత దర్శనం(Free Darshan) లేదా సర్వ దర్శనం టికెట్లను మాత్రమే ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు(Tirumala Special Darshan Tickets), దివ్య దర్శనం, ఆర్జీత సేవల టికెట్లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేవని టీటీడీ తెలిపింది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు తెలిపింది.
తిరుమల ఉచిత దర్శనం ఆఫ్‌లైన్ టికెట్ల బుకింగ్ విధానం(Tirumala Darshan Tickets Offline Mode)
- తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లలో ఉచిత దర్శనం టికెట్లు పొందవచ్చు.
- ఈ కౌంటర్లలో ఆధార్ కార్డు చూపించి యాత్రికులు ఉచిత దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- తిరుపతిలో ఉచిత దర్శనం కోసం కౌంటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్ణీత సమయాల్లో లేదా టికెట్లు పూర్తయ్యే వరకు ఇస్తారు.
- ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన ముందుగా వచ్చిన వారికి కౌంటర్ లో టికెట్లు లభిస్తాయి.
- 24 గంటల వ్యవధితో సర్వదర్శనం టికెట్లు అందిస్తాయి. టికెట్లు పొందిన యాత్రికులు సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్‌లైన్ మోడ్‌లో తిరుమలలో వసతిని పొందవచ్చు.
తిరుమల రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో బుకింగ్ ఎలా?(Tirumala Darshan Tickets Online Mode)
- తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.in ను సందర్శించాలి. ప్రతి నెల 24 లేదా 25 తేదీల్లో స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల చేస్తారు.
- టీటీడీ వెబ్ సైట్ లో యాత్రికుడు మొబైల్ నంబర్ తో లాగిన్ కావాలి. ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ పేజీలో స్లాట్ బుక్ చేసుకుంటే ఏ నెలలో ఎప్పటి వరకు దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న తేదీల్లో దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయని అర్థం. పసుపు రంగులో ఉంటే దర్శనం టికెట్లు వేగంగా బుక్ అవుతున్నాయని అర్థం. ఎరుపు రంగు ఉంటే ఆ తేదీల్లో దర్శనం టికెట్లు అందుబాటులో లేవని అర్థం. నీలం రంగు ఉంటే ఆ తేదీల్లో టికెట్లు విడుదల చేయలేదని అర్థం.
- యాత్రికులు ఏ రోజున శ్రీవారి దర్శనం టికెట్లు కావాలో ఆ తేదీని సెలెక్ట్ చేసుకుని, ఎన్ని టికెట్లు కావాలో నమోదు చేసుకోవాలి. అనంతరం టికెట్ బుకింగ్ క్యూలో వేచి ఉండాలి. ఈ వెయిటింగ్ టైం అందుబాటులో ఉన్న టికెట్లు, బుకింగ్ చేసుకోవాలనుకుంటున్న భక్తులపై ఆధారపడి ఉంటుంది.
- తిరుమలలో వసతి సదుపాయం కోసం ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ సర్వీసెస్ లో 'Accommodation' లోకి వివరాలు నమోదు చేసి పేమెంట్ చేసి వసతి గదులు బుక్ చేసుకోవచ్చు.