Tirumala : ఈ నెల 24న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి - భక్తులు వీటిని తీసుకురావొద్దు-tumburu theertha mukkoti 2024 is scheduled on march 25 in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈ నెల 24న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి - భక్తులు వీటిని తీసుకురావొద్దు

Tirumala : ఈ నెల 24న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి - భక్తులు వీటిని తీసుకురావొద్దు

Tumburu Theertha Mukkoti in Tirumala 2024: మార్చి 24, 25వ తేదీల్లో తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. ఈ మేరకు టీటీడీ(TTD) ప్రకటన విడుదల చేసింది.

తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి (TTD Twitter)

Tumburu Theertha Mukkoti 2024: శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి వేడుక(Tumburu Theertha Mukkoti)కు సంబంధించి ప్రకటన విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). ఈ నెల 24, 25వ తేదీల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు తెలిపింది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించింది.

వారికి అనుమతి లేదు - టీటీడీ

తుంబురు తీర్థానికి(Tumburu Theertha Mukkoti) మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, మ‌ళ్లీ మ‌రుస‌టి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్ర‌మే భక్తులను అనుమతిస్తారని టీటీడీ స్పష్టం చేసింది. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, త్రాగునీరు అందించనున్నారు. ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కావున గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.

వాటిని తీసుకురావొద్దు

ఇక ఈ ఉత్సవానికి వచ్చే భక్తులకు కీలక సూచన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. మరోవైపు పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి…. స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.