Road Accident : చెట్టుకు ఢీకొన్న కారు - అక్కడికక్కడే ముగ్గురు మృతి
27 June 2024, 16:13 IST
- Road Accident in Palnadu District : పల్నాడు జిల్లాలో ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం
Road Accident in Palnadu District : ఇన్నోవా కారు చెట్టుకు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మృతుల్లో భార్య, భర్తలు ఉన్నారు. అలాగే తీవ్రంగా గాయపడిన నలుగురు భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఒకే కుటుంబానికి చెందినవారే. గురువారం తెల్లవారు జామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద జరిగిన ఈ ఘటన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో ప్రయాణిస్తుండగా జరిగింది. ఈ ఘటనలో కుటుంబానికి చెందిన భార్య భర్తలు మరణించగా, ఆయన కుమారుడు, కుమారుడి భార్య, పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
గురువారం తెల్లవారు జామున అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై పల్నాడు జిల్లా వినుకొండలోని కొత్తపాలెం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగి సోమేసి బాలగంగాధర్ శర్మ కుటుంబ సభ్యులు కర్ణాటకలోని బళ్లారిలో శుభకార్యానికి వెళ్లారు. ఆ శుభకార్యాన్ని ముగించుకొని ఇన్నోవా కారులతో తిరిగి గుంటూరు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటారనే లోపే ఈ విషాదం చోటు చేసుకుంది.
అదుపు తప్పటంతోనే…..
పల్నాడు జిల్లా వినుకొండలోని కొత్తపాలెం వద్దకు వచ్చేసరికి కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా అతివేగంగా చెట్టును ఢీకొట్టేసరికి, కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో సోమేసి బాలగంగాధర్ శర్మ (78), ఆయన భార్య యశోద (69), కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
సోమేసి బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ఎస్‌వై నాగశర్మ, కోడలు నాగసంధ్య, వారి పిల్లలు అనుపమ, కార్తిక్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో నాగశర్మ, నాగసంధ్య మరింత పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
మూడు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు, ఎస్ఐ ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
లారీకి కరెంట్ షాక్...డ్రైవర్ మృతి
తిరువూరులో లారీ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందారు. రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగోలన గ్రామంలోని ఆర్‌సీఎం చర్చ్ దగ్గరలో లారీకి కరెంట్ తీగలు తగిలాయి. దీంతో లారీకి కరెంట్ షాక్ వచ్చింది.
వెంటనే డ్రైవర్‌కు కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న గంపలగూడెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.