Visakhapatnam : ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీలన్ని ఖాళీ.. డిమాండ్ లేని రూట్‌లో ఎందుకు?
25 November 2024, 11:05 IST
- Visakhapatnam : వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. చాలా రూట్లలో బాగా డిమాండ్ ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడిచే ట్రైన్‌కు డిమాండ్ నామమాత్రంగా కూడా లేదు. దీంతో ఈ రైలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో డిమాండ్ లేని రూట్‌లో ఎందుకు.. వేరే మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వందేభారత్
చాలావరకు వందేభారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టికెట్లు లభించడం కష్టంగా ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య ప్రవేశపెట్టిన వందేభారత్ పరిస్థితి దారుణంగా. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, భువనేశ్వర్‌కు వెళ్తున్న వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. విశాఖపట్నం- దుర్గ్ వందేభారత్‌లో మాత్రం బోగీలు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఈ ట్రైన్‌లో మొత్తం 14 బోగీలు ఉన్నాయి. వాటిల్లో దాదాపు 10 బోగీలు నిత్యం ఖాళీగానే ఉంటున్నాయి. అయితే.. ఖాళీగా నడపటం కంటే.. వేరే రూట్‌లో నడిపిస్తే బాగుటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. బోగీలను తగ్గించి, మరో మార్గంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ రైలు విశాఖపట్నం- దుర్గ్ మధ్య 9 స్టేషన్లలో ఆగుతుంది. విజయనగరం, పార్వతీపురం, రాయగడ, కేసింగ, తిట్లాఘర్, కంతబంజి, కరియార్ రోడ్, మహాసముంద్, రాయ్‌పూర్ స్టేషన్లలో ఆగుతుంది.
వీటిల్లో కొన్ని స్టేషన్ల నుంచి మాత్రమే ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఈ వందేభారత్ రైలులో మొత్తం1,286 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదట్నుంచీ ఈ రైలుకు ఆదరణ లేదు. అయితే.. నెమ్మదిగా ప్రయాణికులు పెరుగుతారని అధికారులు భావించారు. కానీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మరోవైపు ఈ రైలుకు మరికొన్ని స్టేషన్‌లలో హాల్ట్‌లు ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఛార్జీలు ఇలా..
విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు ఛైర్ కార్ రూ.435, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ రూ.820. విశాఖపట్నం నుంచి పార్వతీపురం వరకు ఛైర్‌కార్ రూ.565, ఎగ్జిక్యూటివ్ కారు రూ.1075గా నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి రాయగడకు ఛైర్‌కార్ రూ.640, ఎగ్జిక్యూటివ్ రూ.1230 ఛార్జీ ఉంది. విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు ఛైర్‌కార్ రూ.1435, ఎగ్జిక్యూటివ్ రూ.2645. విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు ఛైర్‌కార్ రూ.1495, ఎగ్జిక్యూటివ్ రూ.2760గా నిర్ణయించారు.
ఈ ఛార్జీలతో సామాన్యులు రైలు ఎక్కడం లేదు. కానీ.. దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.