Vande Bharat train: విశాఖ పట్నం వందేభారత్ రైలుపై రాళ్ల దాడి; కిటికీ అద్దాలు ధ్వంసం-stones pelted at vande bharat train window panes damaged ahead of flagging off ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vande Bharat Train: విశాఖ పట్నం వందేభారత్ రైలుపై రాళ్ల దాడి; కిటికీ అద్దాలు ధ్వంసం

Vande Bharat train: విశాఖ పట్నం వందేభారత్ రైలుపై రాళ్ల దాడి; కిటికీ అద్దాలు ధ్వంసం

Sudarshan V HT Telugu
Sep 14, 2024 06:26 PM IST

Vande Bharat train: ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్ -విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ జరుగుతుండగా ఆ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో వందేభారత్ ట్రైన్ లోని మూడు బోగీల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి

Vande Bharat train: ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ జిల్లాలో దుర్గ్ -విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ జరుగుతుండగా కొందరు దుండగులు దానిపై రాళ్ల దాడి చేశారు. ఈ వందే భారత్ ట్రైన్ మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు బోగీల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

నిందితుల అరెస్ట్

ట్రయల్ రన్ జరుగుతుండగా దుర్గ్ -విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లు రువ్విన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను దేవేంద్ర చంద్రకర్, శివ కుమార్ బఘేల్, అర్జున్ యాదవ్, జితు తాండి, లేఖ్రాజ్ సోన్వానీగా గుర్తించారు. వీరంతా బాగ్ బహ్రా నివాసితులు. ఈ రైలును సెప్టెంబర్ 16న దుర్గ్ నుంచి రెగ్యులర్ రన్ కు జెండా ఊపి ప్రారంభించనున్నారు.

విశాఖపట్నం నుంచి దుర్గ్ కు వెళ్తుండగా..

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (మహాసముంద్) ఇన్స్పెక్టర్ ప్రవీణ్ సింగ్ ధాకడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వందేభారత్ రైలు విశాఖపట్నం నుంచి దుర్గ్ కు తిరుగు ప్రయాణంలో బాగ్బహ్రా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నలుగురు ఆర్పీఎఫ్ సిబ్బందికి చెందిన ట్రైన్ ఎస్కార్టింగ్ బృందం ఈ ఘటనపై హెచ్చరికలు పంపింది. రాళ్లదాడి ఘటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

నిందితుడి బంధువు కాంగ్రెస్ కార్పొరేటర్

నిందితులపై రైల్వే చట్టం 1989లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, సెక్షన్ 153 (ఉద్దేశపూర్వక చర్య లేదా తప్పిదం ద్వారా రైల్వేలో ప్రయాణించే వ్యక్తి భద్రతకు భంగం కలిగిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది) అధికారులు తెలిపారు. అరెస్టయిన నిందితుడి దగ్గరి బంధువు బఘేల్ బాగ్ బహ్రాలో కాంగ్రెస్ కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు. గతంలో కూడా వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆగస్టులో అహ్మదాబాద్-జోధ్ పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (vande bharat express) రాజస్థాన్ లోని పాలి జిల్లాలో రైల్వే ట్రాక్ పై ఉంచిన సిమెంట్ స్లాబ్ ను ఢీకొట్టింది. జూన్ లో ఫగ్వారా- గోరయా రైలు మధ్య న్యూఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్వారు. కాగా, ఈ నెల ప్రారంభంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్ ను బీఈఎంఎల్ ఫెసిలిటీలో ఆవిష్కరించారు. తదుపరి పరీక్షల కోసం ట్రాక్ పైకి తీసుకురావడానికి ముందు కోచ్ కు మరో పది రోజుల పాటు కఠినమైన ట్రయల్స్, పరీక్షలు నిర్వహించనున్నారు.