IB Syllabus In Andhra: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఐబీ సిలబస్.. నేడు ఒప్పందం
31 January 2024, 10:14 IST
- IB Syllabus In Andhra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌లో విద్యాబోధన చేసేందుకు వీలుగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్స్ అండ్ ట్రైనింగ్ సంస్థతో ఇంటర్నేషనల్ బాకాలారియేట్ (ఐబి) ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఐబి సిలబస్‌తో విద్యాబోధనకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం
IB Syllabus In Andhra: విద్యారంగంలో సంస్కరణల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ను దశల వారీగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఐబి సిలబస్ అమలు కోసం ఒప్పందం కుదుర్చుకోనుంది.
ప్రస్తుతం దేశంలో ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఐబీ సిలబస్‌ను సామాన్యులకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, ప్రీ లోడెడ్ బైజూన్ కంటెంట్ తో కూడిన టాబ్‌లు పంపిణీ, ఐఎఫ్‌పీలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ లాబ్ లు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునిక మౌలిక సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచే టోఫెల్ వంటి పరీక్షలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏపీలో ధనిక, పేద విద్యార్థుల మధ్య ఉన్న విద్యా రంగంలో ఉన్న అంతరాలను రూపుమాపేలా అంతర్జాతీయ విద్యాబోధన IBని సైతం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు.
ఇకపై రాష్ట్ర ప్రభుత్వ SCERTలో అంతర్జాతీయ విద్యాబోర్డు IBకి భాగస్వామ్యం ఉంటుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో IB (ఇంటర్నేషనల్ బాకాలారియేట్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ SCERT స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
క్రమ పద్ధతిలో IB బోధన వైపు..
దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా IBని ఏపీ పాఠశాల విద్యాశాఖ SCERTలో భాగంగా చేయాలని నిర్ణయించారు. తద్వారా ఇకపై ప్రభుత్వ బడుల్లో IB విద్యా విధానం అందుబాటులోకి వస్తుంది.
2024-25లో టీచర్ల సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇస్తారు. జూన్, 2025 నుండి ఒకటవ తరగతికి IB లో విద్యాబోధన ప్రారంభిస్తారు. జూన్ 2026 నుండి రెండో తరగతికి IB లో విద్యాబోధన మొదలవుతుంది. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతూ 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతికి IB సిలబస్‌లో చదువుకున్న వారికి జాయింట్ సర్టిఫికేషన్ ఇస్తారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతిగా ఐబి గుర్తింపు పొందినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో విద్యా బోధన ఉండటం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహంతో పాటు ప్రస్తుత, భావి తరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపకల్పన, బోధనా విధానం, మూల్యాంకనం ఉంటాయని చెబుతుననారు. IB విధానంలో విద్యనభ్యసించిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరకడం మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు ఏపీ సర్కారు చెబుతోంది. sa