Peddapuram Maridamma: పెద్దాపురం మరిడమ్మ ఉత్సవాలకు కొనసాగుతున్న ఏర్పాట్లు
02 July 2024, 17:05 IST
- Peddapuram Maridamma: పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి ఉత్సవం జూలై 5 నుంచి జరగనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఎంతో విశిష్ట కలిగిన మరిడమ్మవారి ఉత్సవానికి రాష్ట్ర నలుమూల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు.
జూలై ఐదు నుంచి పెద్దాపురం మరిడమ్మ ఉత్సవాలు
Peddapuram Maridamma: పెద్దాపురం మరిడమ్మ ఆషాఢమాసం జాతర మహోత్సవం జూలై 5 నుంచి ఆగస్టు 10 వరకు 37 రోజుల పాటు జరుగుతుంది. జూలై 4 (గురువారం) రాత్రి జాగరణ ఉత్సవంతో జాతర ప్రారంభం అవుతుంది. ప్రధానంగా మంగళవారం, గురువారం, ఆదివారాల్లో భక్తుల తాకిడి భారీగా ఉంటుంది.
మిగిలిన రోజుల్లో కాస్తా తక్కువగా ఉంటుంది. దాదాపు నెలకు పైగా జరిగే ఉత్సవం గోదావరి జిల్లాల్లో చాలా పవిత్రంగా చూస్తారు. ఆయా జిల్లాల్లో ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని నివాసం ఉంటున్నవారు కూడా ఈ ఉత్సవానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీమరిడమ్మ వారి దేవస్ధానం నిర్వహించే ఈ ఉత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు.
మరిడమ్మ వారి ఉత్సవానికి ఎలా వెళ్లాలి
మరిడమ్మ అమ్మవారి మహోత్సవం ప్రతి సంవత్సరం జేష్ఠ మాసంలోని అమావాస్య నుండి ప్రారంభమై ఆషాడమాసంలోని అమావాస్య వరకు 37 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఒక్క ఆదివారం రోజునే 40 నుండి 50 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. అలాగే మంగళవారం, గురువారాల్లో కూడా భక్తులు భారీగానే వస్తుంటారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారు.
రైలు మీద వచ్చేవాళ్లు సామర్లకోట రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే బస్సు మీద నుంచి వచ్చేవారు హైదరాబాదు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ పెద్దాపురం పాండవులు మెట్ట వరకు అందుబాటులో ఉంటాయి. అక్కడ బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలో వెళ్లొచ్చు. అలాగే సామర్ల కోట, కాకినాడ, రాజమండ్రి నుంచి బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)