Anantapur District : భార్యపై అనుమానం - కుమార్తెను హత్య చేసిన కన్నతండ్రి!
23 June 2024, 17:04 IST
- Anantapur District Crime News : అనంతపురం జిల్లాలో దారుణం వెలుగు చూసింది.భార్యపై అనుమానంతో కన్న కుమార్తెను చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుమార్తెను హత్య చేసిన తండ్రి...!
Anantapur District Crime News : అనంతపురంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. కన్న కుతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. అభం, శుభం తెలియని చిన్నారని హత్య చేశాడు. భార్యపై అనుమానంతో కన్న కుమార్తెనే కడతేడ్చాడు. అత్యంత పాశవికంగా బావిలోకి తోసేసి చిర్నారిని హతమార్చాడు.
ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ కాలనీలో జరిగింది. నార్పల కొత్త బస్టాండు ప్రాంతానికి చెందిన గణేష్, లలితమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గణేష్ నింతరం మద్యానికి, జూదానికి బానిసై జూలాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో మూడు లక్షల రూపాయాలు అప్పు చేశాడు. భార్య లలితమ్మ కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది.
ఇటీవలి జూన్ 13 నుంచి పాఠశాలు ప్రారంభమవ్వడంతో కుమార్తె పావని (6)ని ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించాలని భర్త గణేష్‌పై ఆమె ఒత్తిడి చేసింది. స్కూల్‌లో చేర్చడానికి తన వద్ద డబ్బులు లేవని గణేష్ చెబుతూ వచ్చేవాడు. ఈ విషయమై ఇంట్లో తగాదాలు జరిగేవి. అయితే భార్యపై అనుమానంతో కుమార్తె తనకు పుట్టలేదన్న కోపంతో పాటు స్కూల్‌లో చేర్పించాలని భార్య తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో బిడ్డను వదిలించుకోవాలని గణేష్ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 20న మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ పాఠశాల వద్దకు వెళ్లిన పావనిని తీసుకొని, పాడుబడిన బావి వద్దకు వెళ్లాడు. అందులోకి తోసేసి హత్య చేశాడు. అనంతరం తన కుమార్తె పావని కనిపించలేదని నార్పల పోలీసులుకు గణేష్ ఫిర్యాదు చేశాడు.
ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కేసును స్వీకరించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ గౌతమిశాలి కూడా నార్పలకు చేరుకుని ఘటనపై విచారణ చేశారు. గత రెండు రోజులుగా పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పోలీసు సిబ్బందితో నార్పల శివారులో బాలిక కోసం గాలిస్తుండగా ఓ పాడుబడిన వ్యవసాయ బావివద్ద బాలిక తండ్రి గణేష్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులను చూడగానే పారిపోవడానికి గణేష్ ప్రయత్నించాడు. దీంతో పోలీసులకు ఆయనపై అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారణ జరపగా వాస్తవాలు బయటకు వచ్చాయి.
కుమార్తె తానే బావిలోకి తోసేసినట్లు తండ్రి గణేష్ అంగీకరించాడు. మృతదేహం నీటిలో తేలిందో లేదో చూడటానికి బావి వద్దకు వచ్చినట్లు తెలిపారు. పోలీసులు బావి వద్దకు వెళ్లి చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యులు బోరున విలపించారు.