తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dhana Bank : డిపాజిటర్లకు కుచ్చుటోపీ…. 20ఏళ్లకు శిక్ష ఖరారు…

Dhana Bank : డిపాజిటర్లకు కుచ్చుటోపీ…. 20ఏళ్లకు శిక్ష ఖరారు…

HT Telugu Desk HT Telugu

22 November 2022, 9:36 IST

google News
    • Dhana Bank అధిక లాభాల పేరుతో డిపాజిటర్లను మోసం చేసిన ధన బ్యాంకు కేసులో తుది తీర్పు వెలువడింది. దాదాపు 20ఏళ్లుగా సాగుతున్న కేసు దర్యాప్తులో ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోట్లాది రుపాయలు కాజేసిన వ్యవహారంలో 21మంది పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తరహా కేసుల్లో నిందితులకు తొలిసారి  డిపాజిటర్ల చట్టం ప్రకారం  శిక్షలు ఖరారు చేశారు. 
డిపాజిటర్లను మోసం చేసిన కేసులో పదేళ్ల జైలు శిక్ష
డిపాజిటర్లను మోసం చేసిన కేసులో పదేళ్ల జైలు శిక్ష (HT_PRINT)

డిపాజిటర్లను మోసం చేసిన కేసులో పదేళ్ల జైలు శిక్ష

Dhana Bank డిపాజిటర్లను మోసం చేసి, సొమ్ము కాజేసిన ధన బ్యాంకు కేసులో నిందితులకు ఇరవయ్యేళ్లకు జైలు శిక్షను ఖరారు చేస్తూ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. నిందితులుకు విడివిడిగా మూడు శిక్షలు ఖరారు చేసినా వాటన్నింటిని ఏక కాలంలో అమలు చేయాలని ఆదేశించడంతో పదేళ్ల జైలు శిక్షకు పరిమితమైంది. నిందితులు విడివిడిగా శిక్ష అనుభవించాలని ఆదేశిస్తే 30ఏళ్ల పాటు జైలును అనుభవించాల్సి వచ్చేది.

సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో 21 మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్‌ కుమార్‌ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో మొదటిసారి డిపాజిటర్ల యాక్టు కింద నిందితులకు శిక్ష విధించారు. ఒక్కో సెక్షన్‌ కింద పదేళ్ల చొప్పున మూడు సెక్షన్లలో జైలు శిక్ష విధించిన న్యాయస్థానం శిక్షలను ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు వెలువడటానికి పదేళ్ల సమయం పట్టింది. ఏలూరుకు చెందిన ధన బ్యాంకులో పలువురు చిరుద్యోగులు, కార్మికులు, రైతులు డబ్బు దాచుకున్నారు. రుపాయి రుపాయి పోగేసి బాధితులు దాదాపు రూ. 2.90 కోట్లు డిపాజిట్లు చేశారు. 2002లో నిర్వాహకులు బోర్డు తిప్పేసి డిపాజిటర్లకు మొండిచేయి చూపారు.

బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులకు కొంతమందిని అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2007లో పూర్తయింది. నిందితులకు శిక్షలు పడతాయనుకుంటున్న సమయంలో ధన బ్యాంకు ఛైర్మన్‌ ఎ1 నిందితుడైన రావూరి సత్యసాగర్‌ పరారయ్యాడు. ఆ తర్వాత విచారణ మందగించింది. బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్‌బీఐ ద్వారా కొంత మొత్తం అంద చేసింది. కేసు దర్యాప్తు తీరులో పోలీసుల తీరుపై పలు విమర్శలు సైతం వచ్చాయి. ఎట్టకేలకు నిందితులకు శిక్షలు ఖరారైనా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఉస్సురుమంటున్నారు.

శిక్షలు వీరికే….

ధన బ్యాంకు కేసులో మొత్తం 27 మంది నిందితులుండగా ఐదుగురు మృతి చెందారు. గుండాల గోపి అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. బతికున్న 21 మందిలో బ్యాంకు ఛైర్మన్‌ రావూరి సత్యసాగర్‌, డైరెక్టర్లు, సిబ్బందిలో తల్లాప్రగడ నాగేంద్రప్రసాద్‌, గోలి కృష్ణకుమారి, ఎ.శివాజీ, రావిపాటి వీరవెంకట రామారావు, బాదంపూడి లక్ష్మీకుమారి, చింతా గిరి, కొవ్వూరి శ్రీనివాసరావు, వినుగంటి వెంకట సతీష్‌, బండారు నరసింహమూర్తి, మామిడిబత్తుల నాగశ్రీనివాస్‌, జక్కంపూడి శ్రీనివాస్‌, దాసరి బోసురాజు, గొల్లా భాస్కర సత్యనారాయణ ప్రసాద్‌, నక్కా శ్రీనివాసరావు, బోడా సాంబమూర్తి, రావూరి నాగవెంకట సత్యనారాయణ, గుమ్మడి వెంకటరమణమూర్తి, చెన్నకేశవుల రంగనాథ్‌, దుగ్గిరాల శేషసాయి సత్యశేఖర్‌, గద్దే ఉషారాణిలకు జైలు శిక్ష పడింది. జైలు శిక్షలు ఖరారైన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

తదుపరి వ్యాసం