AP TG Winter Updates: ఏపీ, తెలంగాణల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు, అరకులో 3.8డిగ్రీలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్
17 December 2024, 8:58 IST
- AP TG Winter Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 3.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 5.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జనం చలి గాలులకు వణికి పోతున్నారు.
ఏపీ, తెలంగాణల్లో పెరిగిన చలి తీవ్రత
AP TG Winter Updates: ఏపీ తెలంగాణలను చలిగాలులు వణికిస్తున్నాయి, అరకులోయలో సోమవారం 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఏజెన్సీ ప్రాంతంలో పగటి సమయం మొత్తం మంచు దుప్పట్లోనే ఉంటోంది. మధ్య భారత దేశం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి పెరిగినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం మన్యంలో పలు ప్రాంతాల్లో ప్రజలు చలికి ఇబ్బందులకు గురయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో సోమవారం 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి మాడుగులలో 4.1 డిగ్రీలు, డుంబ్రిగూడలో 7.3 డిగ్రీలు, చింతపల్లి, ముంచంగిపుట్టులో 8.1డిగ్రీలు, హుకుంపేటలో 8.8 డిగ్రీలు, పెదబయలులో 9.0, అనంతగిరిలో 9. 4, కళింగపట్నంలో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ ఏడాది తొలిసారి సోమవారం ఏజెన్సీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు గిరిజనులు వణుకుతున్నారు. పగటి పూట కూడా వాహనాలను లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి చలి స్వల్పంగా తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏజెన్సీ ప్రాంతాలలో చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అరకులో 3.8, డుంబ్రిగుడలో 6, గూడెం కొత్తవీధిలో 7.9. హుకుంపేటలో 7.8 డిగ్రీలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, శ్రీసత్యసాయి, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, అన్నమయ్య, ఏలూరు. జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకంటే తగ్గాయి. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని అన్ని జిల్లాల్లో మంగళ వారం చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల తర్వాత వాతావరణం కొంత మార్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో కూడా అదే పరిస్థితి….
తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు పలకరిస్తున్నాయి. ఉదయం 10 దాటినా మంచు తగ్గడం లేదు. చలి తీవ్రత పెరగడంతో తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులు, చిన్నారులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆది,సోమవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువున నమోదు అయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అన్ని మండలాల్లో 10 డిగ్రీల్లోపు ఉష్ణో గ్రత నమోదైంది. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వికారాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్
తెలంగాణ మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఉమ్మడి ఆది లాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ 'అరెంజ్', మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు 'ఆరెంజ్', మిగిలిన జిల్లాలకు 'పసుపు' రంగు హెచ్చరికలు జారీ చేసింది.