TDP vs YCP: టార్గెట్ జగన్... ‘జగనాసుర రక్త చరిత్ర’ అంటూ టీడీపీ మరో అస్త్రం
11 February 2023, 6:27 IST
- jaganasura Raktha Charitra Book: సీఎం జగన్ టార్గెట్ గా ప్రతిపక్ష టీడీపీ మరో అస్త్రం సంధించింది. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జగన్ తీరుపై ఏకంగా ఓ పుస్తకానే విడుదల చేసింది. దీనికి 'జగనాసుర రక్త చరిత్ర’ అనే పేరు పెట్టింది.
పుస్తకం విడుదల చేస్తున్న టీడీపీ నేతలు
TDP Releases jaganasura Raktha Charitra Book: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి... సీఎం జగన్ టార్గెట్ గా టీడీపీ సరికొత్త అస్త్రాన్ని సంధించింది. సీఎం జగన్ తో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ... ఏకంగా ఓ బుక్ ను ముద్రించింది. దీనికి జగనాసుర రక్త చరిత్ర అని పేరు పెట్టిన టీడీపీ... శుక్రవారం ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో ప్రధానంగా వివేకా హత్య కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరును ప్రధానంగా ప్రస్తావించింది. వైఎస్ అవినాశ్ రెడ్డి పేరుతో పాటు పలువురి పాత్రలను పేర్కొంది.
శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ‘జగనాసుర రక్త చరిత్ర బహిరంగం’ పుస్తకాన్ని ఆ పార్టీ నేతలు విడుదల చేయగా... త్వరలోనే వీటిని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని చెప్పారు. వైఎస్ వివేకా హత్య విషయం ముందుగానే జగన్ కు తెలుసని టీడీపీ ఆరోపించింది. హత్య జరిగిన రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి... చాలాసార్లు జగన్ దంపతులతో మాట్లాడారని పేర్కొంది. జగన్ కు తెలియకుండా ఈ హత్య జరిగే అకాశం లేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేశారని తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు బయటకు రాకుండా తొక్కిపట్టడానికి విశ్వప్రయత్నం చేశారని ఆరోపించింది. సీబీఐ చేతులు కట్టివేయడానికి కూడా పడరాని పాట్లు పడ్డారని ప్రస్తావించింది.
వైఎస్ వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కావాలంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారు?
గుండెపోటు మరణం అని అనేక గంటలపాటు స్క్రోలింగ్ నడిపారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వచ్చి హత్య ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు.
ఈ కేసులో నిందితుడైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇప్పటివరకూ పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు?
కడప కారాగారంలో రిమాండులో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా.. కడప రిమ్స్ ఆసుపత్రికి ఎలా తరలించారు? జగన్‌మోహన్‌రెడ్డి అండ లేకుండా ఇది సాధ్యమా? వివేకా హత్యానంతరం వేకువజామున 3 గంటలకు భారతి పీఏ నవీన్‌కు అవినాష్‌రెడ్డి ఎందుకు ఫోన్ చేశారు? భారతి ఆ సమయంలో అవినాష్‌తో ఏం మాట్లాడారు?
హత్య విషయం బయటకు వచ్చాక నెపం చంద్రబాబుపై తోసి సొంత పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. సీబీఐ దర్యాప్తులో ఇప్పుడు వేళ్లన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయి.
అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈ హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదుర్చుకున్నట్లు చెప్పారు. రూ.40 కోట్లు ఇచ్చే ఆర్థిక శక్తి ఎవరికి ఉంది? దీనిని బట్టే ఎవరి పాత్ర ఉందో అర్థమవుతోంది.
ఈ హత్యను టీడీపీపై రుద్ది ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసినందుకు వైసీపీ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది.