Pawan on JSP TDP Alliance : గౌరవప్రదమైన పొత్తు ? బాల్ టీడీపీ కోర్టులోకి..
Pawan on JSP TDP Alliance : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. పొత్తులతోనే పోటీ అన్న జనసేనాని పవన్.. కాకపోతే అవి గౌరవ ప్రదంగా ఉండాలంటూ కండీషన్ పెట్టి.. బాల్ ని టీడీపీ కోర్టులోకి నెట్టారు. దీంతో.. ఈ విషయంపై టీడీపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారగా... రెండుపార్టీల తీరుని నిశితంగా గమనిస్తోన్న బీజేపీ.. మరింత స్పష్టత కోసం వేచి చూస్తోంది.
Pawan on JSP TDP Alliance : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అప్పటి పరిస్థితులు, పార్టీల బలాబలాలు, పోరాడాల్సిన శత్రువు.. ఇలా అనేక సమీకరణాలు.. పాలిటిక్స్ లో నేతలు, పార్టీల మధ్య మిత్ర, వైరి బంధాలను డిసైడ్ చేస్తాయి. తమ ఉమ్మడి ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు.. పార్టీల విధానాలు, వైఖరి వేర్వేరుగా ఉన్నా.. వాటన్నింటినీ పక్కన పెట్టి కలిసి సాగుతాయి. తద్వారా.. పరస్పరం లబ్ధి పొందేందుకు వ్యూహాలు రచించి ఎన్నికల రణ క్షేత్రంలో వాటిని అమలు చేస్తాయి. ఈ క్రమంలో... పార్టీలు తమ ప్రాధామ్యాలపై క్లారిటీతో ఉంటాయి. టీడీపీతో తిరిగి పొత్తు దిశగా కదులుతోన్న జనసేన నుంచి... ఎట్టకేలకు ఆ క్లారిటీ వచ్చింది. శ్రీకాకుళంలో ఇటీవల నిర్వహించిన రణస్థలం యువశక్తి సభా వేదికగా... పొత్తుల అంశంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్... వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తామని... అయితే అదీ గౌరవ ప్రదంగా ఉండాలని వ్యాఖ్యానిస్తూ.... టీడీపీకి పరోక్షంగా సంకేతాలు పంపించారు. ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్న జనసేనాని.. మంచి ఆఫర్ ఇస్తే టీడీపీతో కూటమికి రెడీ అంటూ.. పొత్తుల అంశాన్ని టీడీపీ కోర్టులోకి నెట్టారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత.. రాష్ట్రంలో ఇక టీడీపీ పని అయిపోయిందనే చర్చలు షికారు చేశాయి. తిరిగి పుంజుకోవడం.. కష్టమనే విశ్లేషణలు వచ్చాయి. తిరుగులేని మెజారిటీతో అధికార పీఠాన్ని అధిష్టించిన జగన్ ను గద్దె దించడం టీడీపీ వల్ల అయ్యే పని కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. జనసేన, బీజేపీ కూటమి కూడా ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని... అన్ని నియోజకవర్గాల్లో చూసినా వారి తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేరనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే... మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో... అధికార పార్టీని ఢీకొట్టాలంటే.. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం గత కొన్ని నెలలుగా అటు టీడీపీ, ఇటు జనసేన శిబిరాల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది. టీడీపీకి వచ్చే ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా మారిందని... అందుకే జనసేనతో పొత్తు కోసం వారి నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో... పవన్ కళ్యాణ్ పలుమార్లు మాట్లాడుతూ... ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనంటూ చేసిన వ్యాఖ్యలను... తమకు అందివచ్చిన అవకాశంగా మార్చుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న పొలిటికల్ పండిట్లు పేర్కొంటున్నారు. విశాఖ, కుప్పం ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరస్పరం సంఘీభావం తెలుపుకోవడం.. పొత్తుల అంశాలను తోసిపుచ్చకపోవడం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తోంది. 2019లో ఎవరికి వారే ఒంటిరిగా పోటి చేయడం వల్ల... జగన్ లబ్ధిపొందారనే అభిప్రాయం ఇటీవల పవన్ నుంచి తరచూ వ్యక్తం అవుతోంది. టీడీపీ, జనసేన మధ్య ఓట్లు చీలి... 53 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలిచిందని శ్రీకాకుళం సభలో జనసేనాని చెప్పడం... వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకపోతే మరోసారి నష్ట పోతామనే హెచ్చరిక లాగే ఉంది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను కూడా పొత్తు కోసం మానసికంగా సిద్ధం చేసేందుకే పవన్ ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా.... పొత్తు ఆవశ్యకతను పార్టీ క్యాడర్ కు వివరిస్తూనే.. అవి గౌరవ ప్రదంగా ఉంటేనే అంటూ మెలిక పెట్టి... వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలనే సంకేతాలను టీడీపీకి పంపారు పవన్.
జనసేనతో తిరిగి జట్టు కట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోన్న టీడీపీ... పవన్ కండిషన్ పై ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లు జరిగి... పొత్తు కుదిరితే... పవన్ పార్టీకి 30 నుంచి 40 సీట్లు కేటాయించేందుకు టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిగురు దశలో ఉన్న రెండు పార్టీల మధ్య పొత్తుల అంశంపై మరింత పురోగతి వచ్చి.. చర్చల వరకూ వస్తే... ఇదే సంఖ్యను జనసేనాని ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే... పవన్ ఈ నంబర్ కు అంగీకరిస్తారా ? లేక ఇంకా ఎక్కువ కావాలని ఒత్తిడి చేస్తారా అన్నది చూడాలి !
ఇక.. ఏపీలో ఇప్పటికే జనసేనతో కలిసి సాగుతోన్న బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ వైఖరితో.. ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ వైపు వెళ్లకుండా ఆపేందుకు ఎంతగా ప్రయత్నిస్తోన్నా... పవన్ వ్యాఖ్యలు, తీరు మాత్రం వారి వ్యూహాలకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. శ్రీకాకుళం సభ తర్వాత జనసేనాని వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. పవన్ వ్యాఖ్యలు కొత్తగానే ఉన్నాయని... ఇంకా స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని వ్యాఖ్యానించారు. తద్వారా తాము పవన్ తో కలిసి సాగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పకనే చెప్పారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే... తమ నిర్ణయం ఏంటన్నది వెల్లడించాలని బీజేపీ యోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అప్పటి వరకు రెండు పార్టీల తీరుని నిశితంగా గమనిస్తూ.. సరైన సందర్భం కోసం వేచి చూస్తోంది.