Telugu News  /  Andhra Pradesh  /  Ys Viveka Murder Case Approver Dastagiri Key Comments
వైఎస్ వివేకానంద రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి

Viveka Murder Case : త్వరలోనే బయటకు వివేకా హత్య కేసు నిజాలు.. దస్తగిరి సంచలన కామెంట్స్

05 February 2023, 20:10 ISTHT Telugu Desk
05 February 2023, 20:10 IST

Dastagiri Comments On Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు.

వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా డ్రైవర్ దస్తగిరి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు. హైదరాబాద్(Hyderabad)కు కేసు బదిలీ కావడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కోర్టు(CBI Court)కు హాజరు కావాలని నోటీసులు వచ్చాయని దస్తగిరి వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

సీబీఐ అధికారులకు పక్కా సమాచారం ఉందని.. దాని ప్రకారమే.. సంబంధం ఉన్న వారిని విచారణకు పిలుస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy)ని కూడా విచారణకు పిలిచారని దస్తగిరి చెప్పారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటో సీబీఐ అధికారులు త్వరలోనే వెల్లడిస్తారని, తాను ఈ విషయాన్ని నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు. సమాచారం ఉంటేనే విచారణకు పిలుస్తారని అభిప్రాయపడ్డారు.

'నిజాలు బయటపడే రోజు దగ్గర పడింది. కేసును హైదరాబాద్(Hyderabad)కు బదిలీ చేయడం మంచిదే. ఇబ్బంది పడుతున్న విషయాలను అధికారులకు చెప్పాను. హైదరాబాద్ లో 10న జరుగనున్న సీబీఐ విచారణకు తప్పకుండా వెళ్తాను. అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. విచారణ చేసినంత మాత్రాన ఏమీ కాదు. త్వరలో నిజాలు బయటకు వస్తాయి. జగన్ ప్రభుత్వం(Jagan Govt) కచ్చితంగా విచారణ జరిపితే పది రోజుల్లో తేలేది. కానీ అక్కడ జరగకపోవడం కారణంగానే.. హైదరాబాద్ కు బదిలీ చేశారు.' అని దస్తగిరి అన్నారు.

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder Case) విచారణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ కేసు చర్చనీయాంశమవుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇటీవలే సీబీఐ(CBI) విచారించింది. దీంతో ఈ కేసు మరోసారి.. చర్చనీయాంశమైంది. ఈ కేసులో కీలకమైన ఐదుగురు నిందితులు.. ఈ నెల 10వ తేదీన హాజరుకావాలని సమన్లు జారీ అయ్యాయి. ఐదుగురు నిందితులు.. ఒకేసారి కోర్టుకు హాజరుకావడం.. ఇదే తొలిసారి.

ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొటక్షన్ వారెంట్ బెయిల్ పై ఉన్న మరో ఇద్దరికీ సమన్లు వెళ్లాయి. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోపాటుగా బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలు సీబీఐ కోర్టు(CBI Court)లో హాజరు కావాలి.