Chandrababu Political Struggle: రాజకీయంగా నిస్సహాయ స్థితిలో చంద్రబాబు
28 September 2023, 8:06 IST
- Chandrababu Political Struggle: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అత్యంత నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు ఇప్పుడు కాలు కదలని స్థితిలో ఉన్నారు.
చంద్రబాబు
Chandrababu Political Struggle:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అత్యంత నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు ఇప్పుడు కాలు కదలని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో జాతీయ రాజకీయాలను, కూటముల్ని నిర్దేశించిన బాబుకు ఇప్పుడు బాసటగా నిలిచే పార్టీ కూడా లేకుండా పోయింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కూటముల ఏర్పాటులో, ప్రధాన మంత్రలు, రాష్ట్రపతుల నియామకంలో కూడా ప్రభావం చూపించిన మనిషి ఇప్పుడు రాజమండ్రి జైల్లో రోజులు వెళ్లదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు విస్మరించలేని పాత్ర ఉంది.
రాజకీయంగా నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు వచ్చిన గుర్తింపు వేరే.రాజకీయ నాయకుడిగా కంటే తనను తాను సీఈఓగా అభివర్ణించుకోవడానికే మొగ్గు చూపించే విజనరీ బాబు, కల్లో కూడా ఈ కష్టాలను ఊహించి ఉండరు.
చంద్రబాబు విజన్ ఎప్పుడూ రెండు దశాబ్దాలు ముందుటుందని విస్తృత ప్రచారం ఉంది. ఎవరు వినని రోజుల్లో ఆయన 2020 నినాదాన్ని ఎత్తుకుని ఊదరగొట్టాడు. 2020 నాటికి ఆయన అధికారంలో లేకుండా పోయారు. దీంతో 2047 నినాదం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆ నినాదం తమదే అని కాంపెయిన్ చేసుకోడానికి టీడీపీ ఓ అవకాశం కల్పించారు. బాబు విజన్‌కు అద్దం పట్టే ట్రిక్కులు చాలానే ఉన్నాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు కష్టాలు మొదలై 20 రోజులు కావొస్తుంది. అక్టోబర్ 3వరకు కేసును విచారించే పరిస్థితి లేదు. ఎదురు చూడటం తప్ప ఊరట ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితిలో టీడీపీ ఉంది. చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కొంటున్న కష్టాలకు కారణం ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
చంద్రబాబు అరెస్ట్, కక్ష సాధింపు అంటూ బాబు వర్గీయుల నుంచి నిత్యం విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఓ సంగతిని ప్రధానంగా గుర్తించాలి. టీడీపీ విమర్శలు, ఆరోపణలు, దూషణలు మొత్తం వైసీపీనే టార్గెట్‌గా చేసుకుని సాగుతున్నాయి.నిజానికి జగన్మోహన్ రెడ్డి.. తన రాజకీయ ప్రత్యర్థులకు తనంతట తానుగా ఈ స్థాయి షాక్ ఇచ్చేంతటి అనువైన వాతావరణం ఉండదనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీడీపీ అధినేత మీద పట్టు బిగించాలని జగన్మోహన్ రెడ్డికి ఉన్నా అందుకు చాలా శక్తియుక్తులు అవసరం.
కావాలనే విస్మరించారా…
చంద్రబాబును బంధించి జైల్లో పెట్టడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించింది. టీడీపీ విస్మరించింది అనుకోవడం కంటే దాని జోలికి వెళ్లడం మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుందనే భయం వారిలో కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. జగన్ వెనక రాజకీయంగా అండగా నిలిచిన వారిని విమర్శించే సాహసం కూడా చేయలేకపోతున్నారు.
చంద్రబాబు రాజకీయంగా ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే దోషిగా చూపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. జగన్‌కు అవసరమైన బలం ఎక్కడి నుంచి వస్తుందో వారికి తెలిసినా, అందులో తప్పొప్పులను ఎత్తి చూపే సాహసం కూడా టీడీపీ చేయలేకపోతోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రంలో ఏ కూటమిలోను భాగంగా లేరు. కానీ ఆయన ఆలోచనలు,ప్రణాలికలకు సమయానికి అనుగుణంగా కావాల్సిన మద్దతు మాత్రం లభిస్తోంది.ఏ అదృశ్య శక్తుల నుంచి జగన్‌కు ఇంతటి బలమైన శక్తి లభిస్తుందనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. ప్రస్తుతం చంద్రబాబును కట్టడి చేసే విషయంలో కూడా ఏవో అదృశ్య శక్తుల సహకారం మాత్రం పుష్కలంగా లభిస్తుందని తాజా పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.
చంద్రబాబు రాజకీయంగా చేసిన తప్పులు, నిలకడ లేని రాజకీయాలు, అవకాశవాద ప్రకటనలతో పాటు ప్రత్యర్థులు పన్నిన వ్యూహాల్లో అమాయకంగా చిక్కుకోవడమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా కనిపిస్తుంది. అటు ఇండియా కూటమితో పాటు ఇటు బీజేపీకి కూడా బాబు దగ్గర కాలేకపోయారు. ఎవరికి విశ‌్వసనీయ భాగస్వామిగా మిగలక పోవడంతోనే రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.