తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అమిత్‌షాతో భేటీ

Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అమిత్‌షాతో భేటీ

Sarath chandra.B HT Telugu

07 February 2024, 8:49 IST

google News
    • Chandrababu Delhi Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్ (ఫైల్)
అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్ (ఫైల్)

అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్ (ఫైల్)

Chandrababu Delhi Tour: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా Amith shah తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.20కు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.

చంద్రబాబు బుధవారం రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం రాత్రికి లేదా గురువారం అమిత్‌షాతో సమావేశం అవుతారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.

దేశంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీలో బీజేపీ-జనసేన (Janasena) మధ్య ఎన్నికల పొత్తు ఉండగానే టీడీపీతో జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ TDP అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఆహ్వానం వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ఉదయం చంద్రబాబును చర్చలకు ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

మాట్లాడుకోడానికి ఢిల్లీకి ఆహ్వానించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌ షా ఫోన్‌ చేసిన సమయంలో చంద్రబాబు ఉండవల్లిలో ఉన్నారని, బుధవారం ఢిల్లీ వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అమిత్‌ షా ఆహ్వానం మేరకు బుధవారం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా చంద్రబాబు కలిసే అవకాశాలు ఉన్నాయి.

ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ గుంభనంగా వ్యవహరిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు కావడానికి ముందు ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న సమయంలో లోకేశ్‌ రెండు సార్లు అమిత్‌ షాతో చర్చలు జరిపారు. ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి అమిత్‌షాను లోకేష్‌ కలిశారు. ఆ సమయంలోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఏపీలో జగన్‌ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులు, కేసుల గురించి వివరించినట్టు పేర్కొన్నారు. లోకేష్‌ భేటీలో పొత్తుల ప్రస్తావన లేదని పార్టీ వర్గాలు అప్పట్లో చెప్పాయి. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఉన్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలో బీజేపీ రాజకీయంగా తమకు కలిగే ప్రయోజనాలపై సమీక్షించుకుంటోంది.

మరోవైపు ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని పురందేశ్వరి చేపట్టాక పరిస్థితి మారింది. టీడీపీతో పొత్తు విషయంలో పురందేశ్వరి కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు అమిత్‌షా నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. నేటి భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. ఫిబ్రవరి 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 2014లో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి.

ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి రాజకీయ మద్దతు మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహాయ, సహకారాలు లేకపోతే విజయం సాధించడం సాధ్యం కాదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, టీడీపీ ఎదుర్కొంటున్న ఇబ్బందికరమైన వాతావరణం నుంచి వెసులుబాటు కోసం ప్రయత్నాలు జరగొచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అండ లేకుండా ఎన్నికలకు వెళితే ఫలితం ఉండకపోవచ్చని అంతర్గత సంభాషణల్లో టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

తదుపరి వ్యాసం