Nara lokesh Meets AmithShah: అమిత్ షాతో భేటీ అయిన నారా లోకేష్
Nara lokesh Meets AmithShah: టీడీపీ నాయకుడు నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాకు లోకేష్ వివరించారంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు.
Nara lokesh Meets AmithShah: టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 14నుంచి ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్ బీజేపీ అగ్రనేతల దృష్టికి చంద్రబాబు వ్యవహారాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీల నాయకుల దృష్టికి తీసుకువెళ్లడం మినహా బీజేపీ అగ్రనేతలను కలిసే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి లోకేష్ అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలతో కలిసి లోకేష్, అమిత్‌షాతో భేటీ అయ్యారు.
"రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పగబట్టి తీరును అమిత్ షాకు లోకేష్ వివరంగా వివరించారని, కేంద్రంపై నిందలు వేసే వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా లోకేష్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇస్తారని పురంధేశ్వరి ట్వీట్ చేశారు.
అక్టోబర్ 10,11 తేదీలలో సిఐడి విచారణకు హాజరయ్యారు. బుధవారం విచారణ ముగిసిన తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను 12వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని కలిసిన నారా లోకేష్, జగన్ కక్షసాధింపు చర్యలను, అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లినట్టు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి నారా లోకేష్ వివరించారు.
తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షాకు లోకేష్ వివరించారు. లోకేష్ చెప్పిన అంశాలను విన్న తర్వాత చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? లోకేష్‌పై ఎన్ని కేసులు పెట్టారని ఆరా తీశారు. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రయల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి లోకేష్ వివరించినట్టు తెలుస్తోంది.
73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డట్టు లోకేష్ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
నారా లోకేష్, అమిత్‌షా భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.లోకేష్ తల్లికి పురంధేశ్వరి స్వయనా సోదరి కావడం తెలిసిందే. ఆమె మధ్యవర్తిత్వంతోనే లోకేషకు అపాయింట్‌మెంట్ దొరికినట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్, దాదాపు నెల రోజులుగా జైల్లో ఉండటం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎంపీ రెడ్డప్ప వంటి వారు ఈ తరహా కామెంట్స్ చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం ఏమిటని బీజేపి చెబుతున్నా ప్రచారం ఆగలేదు. ఈ క్రమంలోనే నారా లోకేష్‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్ లభించింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చే క్రమంలో ఈ భేటీ జరినట్టు కనిపిస్తోంది.