తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Naralokesh And Kishanreddy: కిషన్‌ రెడ్డిని ఇరికించేసిన నారా లోకేష్‌..

Naralokesh and Kishanreddy: కిషన్‌ రెడ్డిని ఇరికించేసిన నారా లోకేష్‌..

Sarath chandra.B HT Telugu

13 October 2023, 7:45 IST

google News
    • Naralokesh and Kishanreddy: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలను కేంద్రానికి వివరించేందుకు నారా లోకేష్‌ చేసిన ప్రయత్నాలు  నెలరోజుల తర్వాత ఫలించాయి. గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.అమిత్‌షాతో అపాయింట్‌మెంట్‌  కిషన్‌ రెడ్డి ద్వారా  తెలిసిందన్నారు. 
అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్
అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్

అమిత్‌ షాతో భేటీ అయిన నారా లోకేష్

Naralokesh and Kishanreddy: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత సెప్టెంబర్ 14 నుంచి లోకేష్‌ ఢిల్లీలోనే ఉంటున్నారు.న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దల్ని కలిసేందుకు లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగినా లోకేష్ వాటిని ఖండించారు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం సిఐడి విచారణకు వచ్చిన లోకేష్‌ బుధవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అమిత్‌షాతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్‌తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఉన్నారు. అమిత్‌షాతో భేటీ ముగిసిన వెంటనే ఆ విషయాన్ని పురంధే‌శ్వరి తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. ఆ తర్వాత నారా లోకేష్‌ ఫోటోలను విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అమిత్‌షాతో భేటీపై గురువారం ఢిల్లీలో మాట్లాడిన లోకేష్‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా తనకు సమాచారం అందినట్టు వెల్లడించారు.

అమిత్ షా‌తో జరిగిన భేటీ విషయంలో పెద్దమ్మ ప్రమేయం ఎందుకు ఉండాలనుకున్నారో, మరో కారణం ఏమైనా ఉందో కాని కిషన్‌ రెడ్డి పేరును బయటపెట్టడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు.కొద్ది రోజులుగా ఒకప్పటి బీజేపీ అగ్రనేతల సహకారంతో అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం లోకేష్‌ ప్రయత్నిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్‌ విస్తృత ప్రచారం జరిగింది. సొంత సామాజిక వర్గానికి మాజీ కేంద్ర మంత్రి సాయంతో బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ప్రస్తుత కేంద్ర మంత్రి ఒకరు సాయపడ్డారని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలో గురువారం కిషన్ రెడ్డి ద్వారా అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ లభించినట్టు లోకేష్ వెల్లడించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. బుధవారం మధ్యాహ్నం వరకు కిషన్ రెడ్డి మేడారంలో ఉన్నారని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన యూనివర్శిటీకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మేడారం పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డికి ఢిల్లీ రావాల్సిందిగా సమాచారం వచ్చినట్టు చెబుతున్నారు.

లోకేష్‌ అపాయింట్‌ మెంట్ వ్యవహారంలో కేంద్రమంత్రి ప్రమేయం లేదని చెబుతున్నారు. మరోవైపు అమిత్‌షాతో నారా లోకేష్‌ భేటీ విషయాన్ని పురంధేశ్వరి ఖాతాలో వేసుకునే ప్రయత్నాలను కూడా బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. టీడీపీకి వైసీపీకి మధ్య జరుగుతున్న వివాదంలో బీజేపీ ప్రమేయం లేదని ఏపీ అధ్యక్షురాలు క్లారిటీ ఇస్తున్నా, బంధుత్వం కోసం రాయబారాలు నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

కేసుల గురించి తెలుసుకోడానికి పిలిచారన్న లోకేష్...

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నాయకులపై ఏపీ ప్రభుత్వం పెడుతున్న కేసుల గురించి తెలుసుకోడానికి అమిత్‌షా పిలిపించారని లోకేష్ చెప్పారు.చంద్రబాబుపై,తనపై, తమ పార్టీ నేతలపైనా జగన్‌ ప్రభుత్వం పెడుతున్న కేసులలో నిజానికి మద్దతివ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరినట్లు నారా లోకేశ్‌ వెల్లడించారు.

కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది తనకు తెలియదని చెప్పారు.చంద్రబాబుపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో కేసు పెట్టడంపై టీడీపీ ఎంపీలు లేఖలు రాసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరామని అమిత్‌షా చెప్పారన్నారు.అమిత్‌షా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి పిలవడంతో తాను ఆయన్ను కలిశానని లోకేశ్‌ చెప్పారు.

తదుపరి వ్యాసం