Chandrababu Consultants: చంద్రబాబు జట్టులోకి కొత్త పొలిటికల్ కన్సల్టెంట్లు...!
15 December 2023, 5:30 IST
- Chandrababu Consultants: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను ఏ మాత్రం వదులుకోకూడదనే కృతి నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
టీటీడీ అధినేత చంద్రబాబు
Chandrababu Consultants: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీలో టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నిజానికి తెలంగాణ కాంగ్రెస్‌తో ఏపీ టీడీపీకి ఎలాంటి పొత్తు, అవగాహన లేదు. తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో పోటీ నుంచి తెలంగాణ టీడీపీ తప్పుకుందని అనధికారిక సంభాషణల్లో టీడీపీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో టీడీపీ ఎందుకు పోటీ చేయడం లేదనే విషయంలో ఆ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ అసంతృప్తితో వెళుతూ చెప్పిన నాలుగు మాటలు తప్ప తెలంగాణ విషయంలో టీడీపీ వైఖరి ఏమిటనేది అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌కు కొంత మేర కలిసొచ్చిందని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును టీడీపీ మనస్ఫూర్తిగా అస్వాదిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగు పరిచిన అంశాలు తమకు కూడా పనికొస్తాయేమోనని ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలుకు చెందిన మైండ్ షేర్ అనలిటిక్స్, ఇన్‌క్లూజివ్ మైండ్స్ సంస్థల సాయాన్ని పొందాలని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు.
అప్పుడు వద్దనుకుని.. ఇప్పుడు కావాలనుకుని...
నిజానికి ఏడాదిన్నర క్రితం వరకు ఏపీలో తెలుగుదేశం పార్టీకి సునీల్ కనుగోలు పనిచేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించే వారు. అప్పటికే టీడీపీకి పొలిటికల్ కన్సల్టెన్సీగా రాబిన్ శర్మ నేతృత్వంలోని షో టైమ్ కన్సల్టెన్సీ పనిచేస్తోంది. ఈ రెండు సంస్థలు ప్రశాంత్ కిషోర్ ఐ పాక్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏర్పాటు చేసినవే.
రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు బృందాల మధ్య సమన్వయం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో టీడీపీ సేవల నుంచి సునీల్ తప్పుకున్నారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికలకు పరిమితం అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం, ఆ తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడంతో టీడీపీకి మళ్లీ సునీల్ మీద నమ్మకం పెరిగింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు సునీల్ కనుగోలుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మాదిరి పూర్తి స్థాయిలో కన్సల్టెంట్ సేవలు అందించకపోయినా కాంపెయిన్ విషయంలో సహకరించడానికి సునీల్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పొలిటికల్ కన్సల్టెంట్‌గా రాబిన్ టీమ్ సేవలు అందిస్తున్న నేపథ్యంలో సునీల్ సేవల్ని కాంపెయిన్ స్ట్రాటజీల కోసం వాడుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ టీమ్ రూపొందించిన ప్రకటనలు, మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి వంటి జింగిల్స్ బాగా హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ప్రజల్లో బలంగా వెళ్లే ప్రకటనల్ని రూపొందించడానికి మైండ్ షేర్ అనలటిక్స్ సేవల్ని వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. చిన్న పిల్లలు సైతం పాడేలా ఉన్న జింగిల్స్ బాగా ప్రభావం చూపడంతో వినూత్నమైన ప్రకటనల కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది.
మరోవైపు పొలిటికల్ కన్సల్టెన్సీ సేవల నుంచి తప్పుకుని రాజకీయ పార్టీ పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్‌ను కూడా టీడీపీ సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను టీడీపీ నేతలు ఖండిస్తున్నా పికె సూచనల కోసం డిల్లీలో ఉన్న సమయంలో లోకేష్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందా లేదా అనే దానిపై మాత్రం స్ఫష్టత కొరవడింది. పార్టీలో అత్యున్నత స్థాయిలో చంద్రబాబు, లోకేష్ మాత్రమే పొలిటికల్ స్ట్రాటజీలు, కన్సల్టెన్సీల విషయంలో నిర్ణయాలు తీసుకుంటారని, అవి బయటకు తెలిసే అవకాశాలు లేవని టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు స్పష్టం చేశారు.