తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp | ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

TDP | ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

HT Telugu Desk HT Telugu

01 March 2022, 19:26 IST

google News
    • ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరుణంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. జూమ్ ద్వారా మాట్లాడిన ఆయన ధైర్యంగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని సూచించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి జైశంకర్‌తోనూ తెదేపా అధినేత ఫోన్‌లో మాట్లాడారు.
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులతో మాట్లాడిన చంద్రబాబు
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులతో మాట్లాడిన చంద్రబాబు (HT_PRINT)

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులతో మాట్లాడిన చంద్రబాబు

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు దైర్యంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులతో జూమ్ ద్వారా మాట్లాడి యోగక్షమాలు తెలుసుకున్నారు. 100 మందికిపైగా విద్యార్థులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తెలుగు విద్యార్థులంతా సహకరించుకోవడంతో పాటు...పరిస్థితులపై తటస్థంగా ఉండటం ఎంతో మంచిదని చంద్రబాబు సలహా ఇచ్చారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకం అని చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవడం మంచిదనే సూచనలు పాటించాలని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు టిడిపి ఎన్ఆర్ఐ సెల్ ద్వారా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు కూడా విద్యార్థులకు అందించారు. పలువురు విద్యార్థులు ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను వివరించారు. అక్కడ వేరు వేరు ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం స్థిరపడిన కుమార్, దివ్యా రాజ్‌లు బాధిత విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉన్న ప్రాంతాల నుంచి బయటకు రావద్దని వారు విద్యార్థులకు సలహా ఇచ్చారు.

బంకర్స్‌లో తలదాచుకున్న విద్యార్థులు..

తమ వద్ద రెండు రోజులకు సరిపోను ఆహారం మాత్రమే ఉందని...బాంబు దాడుల కారణంగా మెట్రో స్టేషన్‌లోనే ఉండిపోయామని కొందరు తెలిపారు. స్వయంగా అక్కడి పరిస్థితిని విద్యార్థులు చంద్రబాబు కు ఫోన్ ద్వారా చూపించారు. పోలెండ్, హంగేరీ బోర్డర్ లకు వెళ్లేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నా....వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం అని వివరించారు. తాము ఉన్న ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్ళడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. ప్రస్తుతం బంకర్స్ లో తల దాచుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్ లో ఉన్న ఇతర దేశాల యువత ను కూడా ఆర్మీలోకి రమ్మని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులకు సహాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశానని.. కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తానని వారికి ధైర్యం చెప్పారు.

కేంద్ర మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు..

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన 4 వేల మంది పైగా తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించాలని కోరారు. యుద్ధం కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ రోజు జూమ్ ద్వారా ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన విద్యార్థులతో మాట్లాడిన ఆయన వారి కష్టాలను జై శంకర్‌కు తెలిపారు. తెలుగు విద్యార్థులను తరలించే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్రమంత్రి జైశంకర్ హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థుల వివరాలను తన కార్యాలయంతో పంచుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు కార్యాలయంతో సమన్వయం చేసుకోవడానికి తన మంత్రిత్వ శాఖలో కొందరికి బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం