Chandrababu | జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే.. చివరి ఛాన్స్: చంద్రబాబు
22 February 2022, 10:17 IST
- పార్టీ నేతలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రజల న్యాయం కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. వైకాపా పాలనలో రాష్ట్రం బాగా నష్టపోయిందని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన ఆయన ప్రజలకు న్యాయం చేసేందుకు గట్టిగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు. వైకాపా ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి అవకాశంగా చేసుకున్నారని విమర్శించారు. 175 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, 25 పార్లమెంటు స్థానాల ఇంఛార్జ్‌లతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు పనిచేయని నేతలను ఉపేక్షించని తేల్చి చెప్పారు.
వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడాని దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా నిలుచోవాలని సూచించారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి జగన్ అసమర్థ, స్వార్థపూరిత విధానాలతో రాష్ట్రం బాగా నష్టపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ వద్ద డబ్బు, అధికారం ఉంటే.. తెదేపాకు ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు నిర్ణయాలతో భక్తులు తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. త్వరలోనే ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
పనిచేయని నేతలను ఉపేక్షించం: చంద్రబాబు
పనిచేయని నాయకులను పార్టీ ఇకపై భరించబోదని ఆయన పునరుద్ఘాటించారు. అధిష్ఠానం సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని నాయకులు గుర్తించాలని తెలిపారు. పని చేయనివారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామ, మండల స్థాయిలో పెండింగులో ఉన్న కమిటీల నియమాకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ శత జయంతుత్సవాలు, మహానాడు నిర్వహణపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.