Russia Ukraine War | ఆ పని చేయకండి.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచన
01 March 2022, 13:17 IST
- రష్యా దాడితో బిక్కుబిక్కుమంటున్న ఉక్రెయిన్ నుంచి బయటపడాలని చూస్తున్న భారతీయులకు కీలక సూచన చేసింది భారత ప్రభుత్వం. సరిహద్దు చెక్‌పాయింట్ల దగ్గర పరిస్థితి సున్నితంగా ఉన్నదని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం లేకుండా అక్కడికి వెళ్లొద్దని స్పష్టం చేసింది.
రొమేనియా చేరుకున్న ఉక్రెయిన్ లోని భారతీయుల తొలి బ్యాచ్
కీవ్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన సుమారు 16 వేల మంది భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో వాళ్లను రోడ్డు మార్గం ద్వారా రొమేనియాలాంటి సరిహద్దు దేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఓ ఎయిరిండియా విమానం బుకారెస్ట్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచనలు ఇచ్చింది ప్రభుత్వం. అక్కడి సరిహద్దుల దగ్గర సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం లేకుండా అక్కడి వెళ్లొద్దని సూచించింది. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన విషయం తెలిసిందే. యుద్ధం శనివారంతో మూడో రోజుకు చేరింది.
"ముందస్తుగా ప్రభుత్వ అధికారులతో సమన్వయం లేకుండా, ఎంబసీలోని ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించకుండా సరిహద్దుల్లోని పోస్ట్‌ల దగ్గరికి భారతీయులు వెళ్లొద్దు" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత పౌరులను సురక్షితంగా తరలించేందుకు సరిహద్దు దేశాల్లోని భారత ఎంబసీలతో సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపింది. దేశ పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నవారు కాస్త సురక్షితంగా ఉన్నారని, వీళ్లు తొందరపడి సరిహద్దు చెక్‌పాయింట్ల దగ్గరకి వెళ్లొద్దని సూచించింది.
ఇక ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు అనవసరంగా బయటకు రావొద్దని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని భారతీయుల్లో తొలి బ్యాచ్.. శుక్రవారమే రొమేనియా చేరుకుంది. వీళ్లను తీసుకురావడానికి ఎయిరిండియా విమానం బుకారెస్ట్‌కు వెళ్లింది.
టాపిక్