తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : ఇక గేర్ మార్చండి, వచ్చే 6 నెలలు చాలా కీలకం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

CM Jagan : ఇక గేర్ మార్చండి, వచ్చే 6 నెలలు చాలా కీలకం, పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం

26 September 2023, 19:21 IST

google News
    • CM Jagan : వచ్చే ఆరు నెలలు ప్రతి ఒక్కరికీ చాలా కీలకం అని సీఎం జగన్ పార్టీ నేతలతో అన్నారు. టికెట్లపై ప్రతి ఒక్కరూ తన నిర్ణయాలను స్వాగతించాలని కోరారు. టికెట్ రాని వాళ్లకు మరో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

CM Jagan : ఇక గేర్ మార్చాల్సిన టైం వచ్చిందని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు అన్నారు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం అన్నారు. 175కి 175 స్థానాలు గెలుచుకోవడం పాజిబుల్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయన్న సీఎం జగన్... ఒంటిరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయన్నారు.

మరో రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశామని సీఎం జగన్ అన్నారు. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలన్నారు. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే అన్న జగన్... కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు, మరికొందరికి ఇవ్వకపోవచ్చు, టికెట్లు ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండా పోరు అన్నారు. టికెట్లపై ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలని కోరారు. టికెట్ ఇవ్వని పక్షంలో మరో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ మీద నమ్మకం ఉంచాలన్నారు. సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయని తెలిపారు. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయని పార్టీ నేతలతో అన్నారు. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్న సీఎం జగన్... ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. వచ్చే 2 నెలల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని చేపడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

త్వరలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నామన్నారు. ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తామన్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తామన్నారు. విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం ఐదు దశల్లో చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారన్నారు. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌వోలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు ప్రజా ప్రతినిధులు హెల్త్ క్యాంపు వివరాలు తెలియజేస్తారన్నారు. నాల్గో దశలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు, ఐదో దశలో ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించేందుకు ప్రయత్నిస్తామని సీఎం జగన్‌ తెలిపారు.

తదుపరి వ్యాసం