Steel Plant School: విశాఖ స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయం మూసివేతతో ఆందోళనలో విద్యార్ధులు, పేరెంట్స్
14 June 2024, 13:23 IST
- Steel Plant School: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో నడిచే 40 ఏళ్ల నాటి విశాఖ విమల విద్యాలయం మూసివేయడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచన స్థితిలో పడ్డారు.
స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలోని విమల విద్యాలయం మూసివేతపై ఆందోళన
Steel Plant School: దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన వైజాగ్ స్టీల్‌ప్లాట్ ఆధ్వర్యంలో నడిచే 40 ఏళ్ల నాటి విశాఖ విమల విద్యాలయం మూసివేశారు. దీంతో ఉపాధ్యాయులు దిక్కుతోచన స్థితిలోకి పడ్డారు. మరోవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఈ స్కూల్ మూసివేత జరుగుతుందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
1984లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉక్కు నగరంలో విశాఖ విమల విద్యాలయాన్ని ప్రారంభించింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా పేద విద్యార్థులకు అండగా ఈ విద్యాలయం నిలుస్తూ వస్తుంది. ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దింది. మరెందరికో బంగారు భవిష్యత్తును అందించింది. అలాంటి విద్యాలయాన్నివైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉన్నఫళంగా గురువారం మూసివేసింది.
రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులున్న స్కూల్స్‌లో విమల విద్యాలయం ఒకటి. రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులున్న స్కూల్స్‌లో విశాఖ విమల విద్యాలయం ఒకటిగా నిలిచింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు దాదాపు 2,400 మంది విద్యార్థులు చదువుతున్నారు.
20 మంది ఉపాధ్యాయులతో పాటు మొత్తం 60 మంది సిబ్బంది పని చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న విద్యార్థులకు తెలుగు మీడియం ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం నామమాత్రపు ఫీజుతో అందిస్తుంది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఈ విద్యాలయంలో చదువుతున్నారు. కూర్మన్నపాలెం, వడ్లపూడి, అనగంపూడి, గాజువాక తదితర ప్రాంతాల విద్యార్థులు ఈ పాఠశాలలోనే చదువుతున్నారు. ఇందులో చదివే విద్యార్థుల్లో అధిక శాతం రోజువారీ కూలీల పిల్లలు, స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలే ఉంటారు.
అడ్మిషన్లు ప్రారంభించి మూసివేత..
2024-25 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభించి మూసివేశారు. అడ్మిషన్లు ఇచ్చినప్పుడు మొదటి టెర్మ్ ఫీజులు సైతం కట్టించుకున్నారు. ఆ తరువాత హఠత్తుగా గురువారం పాఠశాలను మూసి వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న చర్యను వైజాగ్‌లోని విద్యా వేత్తలు, విద్యా రంగ పరిరక్షకులు తీవ్రంగా నిరసిస్తున్నారు.
నిధులు సమకూర్చలేమని సాకు
విద్యాలయానికి నిధులు సమకూర్చలేమని సాకుతో పాఠశాలను మూసివేశారు. విద్యాలయానికి నిధులు సమకూర్చలేని పరిస్థితిలోకి చేరిందని, అందుకనే పాఠశాల మూసివేత తప్పడం లేదని యాజమాన్యం చెబుతోంది. సీఎస్ఆర్ నిధుల కింద విడుదల అవుతున్న పాఠశాల నిర్వహణ ఖర్చును భరించే బాధ్యత స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది.
40 ఏళ్లగా పేద విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న పాఠశాల ఒక్కసారిగా మూతపడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. పాఠశాల అధ్యపకులు దిక్కుతోచని స్థితిలోకి పడ్డారు. ఇక పాఠశాలకు రావద్దని అధ్యపకులకు సైతం మెసేజ్‌లు పంపడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణలోని భాగమే ఈ స్కూల్ మూసివేత అని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని పెట్టుబడులను వంద శాతం ఉపసంహరణ చేయాలని గతంలో కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయించింది. నీతి ఆయోగ్ సూచన మేరకు కేంద్ర మంత్రి వర్గం కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధంగా ఉన్న వాటిపై తొలిత పడింది.
పాఠశాల వద్ద ఆందోళన..
విద్యాలయం మూసివేస్తున్ననట్లు యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు, జీవీఎంసీ 78వ వార్డు (గాజువాక) సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు అక్కడకు చేరుకొని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గంగారావు, సీఐటీయు స్టీల్‌ప్లాంట్ జోన్ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ పాఠశాలను యాథావిధిగా కొనసాగించాలని, లేకపోతే ఆందోళన కొనసాగుతోందని హెచ్చరించారు.
స్టీల్‌ప్లాంట్ సిఎండి బంగ్లా ముట్టడి..
విద్యాలయం మూసివేతను వ్యతిరేకిస్తూ శుక్రవారం స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ బంగ్లాను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడించారు. అలాగే పాఠశాల మూసివేత నిర్ణయంపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)