తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apration Mafia: ఊరురా రేషన్ మాఫియా... రాజకీయమే అసలు శాపం.. జనం తినని బియ్యానికి వేల కోట్ల ఖర్చు..

APRation Mafia: ఊరురా రేషన్ మాఫియా... రాజకీయమే అసలు శాపం.. జనం తినని బియ్యానికి వేల కోట్ల ఖర్చు..

02 December 2024, 10:10 IST

google News
    • AP Ration Mafia: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అసలు కారణాలను అన్వేషించకుండా రాజకీయం సాగుతోంది. ఓట్ల వేటలో ఇబ్బడిముబ్బడిగా రేషన్‌ కార్డులు జారీ చేయడమే ఈ సమస్యకు మూల కారణం. జనం ఆహారంగా వినియోగించని దొడ్డు బియ్యంతో దళారులు కోట్లు కొల్లగొడుతున్నా ప్రభుత్వం కళ్లు ముసుకుంటోంది.
కాకినాడలో ఎక్స్‌పోర్ట్‌కు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్
కాకినాడలో ఎక్స్‌పోర్ట్‌కు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్

కాకినాడలో ఎక్స్‌పోర్ట్‌కు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్

AP Ration Mafia: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం కోటి 55లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటి 48లక్షల మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయి. కేవలం ఏడు లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డు లేదు. రాష్ట్రంలో దాదాపు కోటి 55లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల్లో కోటి 62 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాల లెక్కకు రేషన్ కార్డుల లెక్కకు ఎక్కడా పొంతన కుదరదు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కార్పొరేషన్లు, యూనివర్శిటీల ఉద్యోగులు 14లక్షల మంది ఉంటారు. కుటుంబాలకు, రేషన్ కార్డులకు మధ్య ఆ మాత్రం వ్యత్యాసం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాలు కూడా లెక్కేస్తే అనర్హులకు పెద్ద ఎత్తున రేషన్ కార్డులున్న సంగతి స్పష్టం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అనర్హులకు రేషన్ కార్డులు కొనసాగుతున్నాయి. అపార్ట్‌మెంట్లలో వేల రుపాయల అద్దె చెల్లించి నివాసం ఉండే వారు సైతం తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల కోసం అడ్డదారిలో దక్కించుకున్న రేషన్ కార్డుదారుల్లో చాలామంది రేషన్ బియ్యాన్ని తీసుకోవడం లేదు.

అక్రమ కార్డులతోనే మొదలు…

రేషన్‌ కార్డుల జారీకి అర్హతలను నిర్ణయించినా కొన్నేళ్లుగా అక్రమంగా తెల్ల రేషన్ కార్డుల జారీ కొనసాగింది. 2006కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు రకాల రేషన్‌ కార్డులు ఉండేవి. దారిద్ర్యరేఖకు దిగువున ఉండే వారికి తెల్ల కార్డులు, ఎగువను ఉన్న వారికి పింక్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసేది. తెల్ల కార్డు దారులకు బియ్యంతో పాటు ఇతర సరుకులు లభిస్తే పింక్‌ కార్డులకు కిరోసిన్, చక్కెర, గోధుమలు వంటి వాటిని సబ్సిడీ ధరలకు పంపిణీ చేసేవారు. వంట గ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగడంతో 2000 సంవత్సరానికి ముందే కిరోసిన్ పంపిణీ నిలిచిపోయింది.

2004 కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫీజు రియింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకాలకు తెల్ల రేషన్‌ కార్డును ప్రామాణికంగా నిర్ణయించారు. 2009 నాటికి పింక్‌ కార్డులు మాయమై తెల్లరేషన్‌ కార్డులు మాత్రమే మిగిలాయి. 2009 తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలను ఆకట్టుకునే క్రమంలో విచ్చలవిడిగా రేషన్‌ కార్డులు పుట్టుకొచ్చాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి లెక్కకు మించి రేషన్‌ కార్డులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం అనే తేడా లేకుండా ఏపీలో రేషన్‌ కార్డులు జారీ అయ్యాయి.

2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలకు రేషన్‌ కార్డుల ఏరివేత సమస్యగా మారింది. రెవిన్యూ, సివిల్‌ సప్లైస్‌ సిబ్బందితో పాటు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో చూసిచూడనట్టు వ్యవహరించడంతో రేషన్‌ కార్డుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వచ్చింది.

రేషన్ బియ్యం తినరు, కార్డుల్ని వదలరు...

ప్రస్తుతం ఏపీలో కోటి 48లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాయి. వీటిలో 92లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ అందుతోంది. మరో 56లక్షల కార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రేషన్‌ కార్డులకు అందించే బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5700కోట్లను వెచ్చిస్తోంది. కేంద్రం ఇచ్చే వాటాతో కలిపితే అది రూ.13వేల కోట్లకు చేరువలో ఉంటుంది. రేషన్‌ కార్డులతోనే ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట‌్‌, డిబిటి పథకాలను ముడిపెట్టడంతో ఏదో ఒక మార్గంలో రేషన్ కార్డును దక్కించుకుకుంటున్నారు.

ప్రభుత్వ ఖర్చు.. దళారులకు ఆదాయం...

చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే బియ్యాన్ని 90శాతం మంది ఆహారంగా వినియోగించడం లేదు. ప్రభుత్వం బోనస్‌ కలిపి రైతుల నుంచి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని పేదలకు ఆహారంగా సరఫరా చేస్తోంది. ఇలా కిలోకు రూ.43.50 ఖర్చవుతోంది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి 20కిలోల బియ్యం ప్రభుత్వం రైస్‌ కార్డుపై ఇస్తోంది. అంటే నెలకు ఒక్కో కుటుంబానికి రూ.870 ఖరీదైన బియ్యం అందుతోంది.

అదే బియ్యాన్ని కార్డు దారుడు తీసుకోకుండా రేషన్‌ దుకాణాలు, మొబైల్‌ వాహనాలకే వదిలేస్తే కిలోకు రూ.10-12 కార్డుదారుడికి చెల్లిస్తున్నారు. కార్డులో నలుగురు సభ్యులు ఉంటే బియ్యంకు బదులుగా రూ.200 వారికి ఇస్తున్నారు.ఏడాదికి సగటున రూ.10,440 విలువైన బియ్యాన్ని రూ.2400కు అమ్మేసుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి నెల 3,24, 797 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్‌ కార్డులకు చెల్లిస్తున్నారు. ఇందులో బీపీఎల్‌ కార్డులు, ఏపిఎల్‌ కార్డులు, అంత్యోదయ అన్న యోజన కార్డులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌, మిడ్‌ డే మీల్స్‌, అన్నపూర్ణ స్కీమ్‌, అదనపు ఏపిఎల్ కార్డులు ఉన్నాయి. మొత్తం 3.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 80శాతం పైగా తిరిగి బ్లాక్‌ మార్కెట్లకే వెళుతోంది.

జనం తినని బియ్యానికి దండగ ఖర్చు...

ఏపీలో ప్రభుత్వ పథకాలకు వైట్ రేషన్ కార్డును అనుసంధానించడంతోనే ఈ అక్రమాలకు కారణం అవుతోంది. 2014-19 మధ్య రేషన్ బియ్యం స్థానంలో నగదు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచించింది. ఎన్నికలు సమీపించడంతో పాటు విపక్షాల విమర్శలకు కారణమవుతుందనే ఉద్దేశంతో బియ్యం బదులు నగదు చెల్లించే ఆలోచన ఉపసంహరించుకున్నారు.

వేల కోట్ల ఆదాయం..

రేషన్‌ కార్డు దారుల నుంచి రూ.10కు కొనుగోలు చేసే బియ్యాన్ని దళారులు రూ.16-18కు మండల, జిల్లా స్థాయి విక్రేతకు అందిస్తారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం మాఫియాను నియంత్రించే నాయకులు ఉన్నారు. రేషన్‌ వాహనాలు, దుకాణాల నుంచి బియ్యాన్ని నేరుగా వీరికి అందిస్తారు. ఒక్కో మండలంలో నెలకు సగటున 250-300 మెట్రిక్ టన్నుల బియ్యం బ్లాక్‌ మార్కెట్లకు తరలిపోతోంది. ప్రతి నెల రెండున్నర లక్షల కిలోల నుంచి 3లక్షల కిలోల బియ్యాన్ని రేషన్ మాఫియా సొమ్ము చేసుకుంటుంది.

జిల్లా స్థాయి మాఫియా నుంచి మద్యం తయారీ దారులు, ఎగుమతి దారులకు చేరే సరికి దాని ధర గరిష్టంగా రూ.36-38కు చేరుతోంది. రేషన్ కార్డుదారుడికి రూ.10 దక్కితే అదే బియ్యం మీద దళారులు కిలోకు రూ.26-28వరకు సంపాదిస్తున్నారు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలకు రేషన్‌ బియ్యం మిఠాయిలా మారింది.

ఉక్కుపాదం ఒట్టిదే…

ప్రభుత్వం మారిన వెంటనే రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించింది. వాస్తవానికి రేషన్ దుకాణాలు, బియ్యం తరలింపు దందా మాత్రమే చేతులు మారింది. గత ఆర్నెల్లలో గతంలో ఉన్న వారి స్థానంలో కొత్త దళారులు పుట్టుకొచ్చారు.ఒక్కో రేషన్ దుకాణంలో ప్రతి నెల లక్షల రుపాయలు ఆదాయం కనిపిస్తుండటంతో చోట మోట నాయకులు తమ ప్రాంతంలో రేషన్ దందా కోసం ముఖ్యమైన నేతల్ని ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం రవాణా చేస్తుండటంతో బ్లాక్ మార్కెటింగ్ యథేచ్ఛగా సాగుతోంది.

అనర్హులకు రేషన్ బియ్యం పంపిణీతో మొదలవుతున్న వ్యవహారంలో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే అదే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి రాజకీయ నాయకులు కోట్లు కూడబెడుతున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులకు భాగస్వామ్యం ఉంది. ప్రతి రేషన్ దుకాణం సివిల్‌ సప్లైస్‌ అధికారులకు నెలలవారీ మమూళ్లు ముడుతున్నాయి.

అసలు జనం ఆహారంగా వినియోగించని బియ్యం చుట్టూ వేల కోట్ల రుపాయల దందా నడుస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్రమంగా ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం సంచలనం సృష్టించింది. సమస్య మూలాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట ఏ మేరకు సఫలం అవుతారో చూడాలి.

తదుపరి వ్యాసం