Srisailam Dam: పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైలం జలాశయం, ఐదు గేట్ల నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల విడుదల
30 July 2024, 11:41 IST
- Srisailam Dam: ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పొంగున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయం వేగంగా నిండిపోతుంది. మరికొద్ది గంటల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరనుంది.
పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైలం జలాశయం
Srisailam Dam: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష‌్ణా నదుల్లోకి వరద ప్రవాహం పెరిగింది. రోజుల వ్యవధిలోనే అడుగంటిపోయిన శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. రిజర్వాయర్‌లో నీటి నిల్వ అనూహ్యంగా పెరిగిపోయింది. నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే వేగంగా శ్రీశైలం జలాశయం నిండుతోంది. మరికొద్ది గంటల్లోనే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరనుంది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో శ్రీశైలం జలాశయం ఐదు గేట్లు పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర, కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర‌్షాలతో 4.60లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల నుంచి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. 60వేల క్యూసెక్కుల నీటిని విద్యుతుత్పత్తికి వినియోగిస్తున్నరు
దీంతో పాటు లక్షన్నర క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి దీనిని మరింత పెంచనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరిగిపోయింది.
శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 3లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలంలో మరిన్ని గేట్లు తెరవాలని నిర్ణయించారు. శ్రీశైలంకు వచ్చిన నీటిని వచ్చినట్టు విడుదల చేసే అవకాశం ఉంది.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 520 అడుగులకు చేరువులో ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వకు 312 సామర్థ్యంలో 139.61 టిఎంసిల నిల్వ ఉంది. సాగర్ నిండాలంటే 173 టిఎంసిల నీరు చేరాలి. 13టిఎంసిల చొప్పున రోజుకు ఇన్‌ఫ్లో కొనసాగితే 10 -12 రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుతుందని మొదట అంచనాల వేశారు. వరద ప్రవాహం భారీగా పెరగడంతో జలాశయం వేగంగా నిండుతున్నట్టు గుర్తించారు. మరోవైపు ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శిస్తారు. కృష్ణానదికి జలహారతులు ఇవ్వనున్నారు.
దీంతో పోతిరెడ్డిపాడుకు 18వేల క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులకు ఒక్కసారిగా జలకళను సంతరించుకున్నాయి. సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నిన్న మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. సాగర్ నీటి వాటాలపై తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణా జలాలను నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహాన్ని నిల్వ చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువన ఓ రిజర్వాయర్, దిగువన మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.