Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం.. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
04 October 2024, 16:42 IST
- Chittoor : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే కుమారుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అటు అనంతపురం జిల్లాలో తల్లిపై కుమారుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడప జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
పెన్షన్ డబ్బుల కోసం తండ్రిని చంపిన కుమారుడు
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం మిట్టారు గ్రామంలో దారుణం జరిగింది. పెన్షన్ డబ్బుల కోసం ఏకంగా తండ్రినే చంపేశాడు ఓ కుమారుడు. మిట్టారు గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వృద్ధుడిని పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తన కుమారుడు సోమశేఖర్ అడిగాడు. డబ్బులు ఇచ్చేందుకు తండ్రి వెంకటేశ్ నిరాకరించాడు. దీంతో కోపోద్రికుడైన కుమారుడు సోమశేఖర్ తన వృద్ధ తండ్రిని కర్రతో చావబాది హత్య చేశాడు. అక్కడి నుండి పరారయ్యాడు.
30 ఏళ్ల వివాదంపై ఘర్షణ..
30 ఏళ్ల స్థల వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా మైలవరం మండలం చిన్నవెంతుర్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. చిన్నవెంతుర్ల గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న స్థలం విషయంలో.. సుమారు 30 ఏళ్లుగా ఇరువర్గాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం ఉదయం ఓ వర్గానికి చెందిన వారు ఏకంగా గొడ్డలి, రాళ్లతో మరో వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రత్యర్థి వర్గానికిచెందిన తండ్రీ కుమారులైన చంద్రశేఖర్ రెడ్డి, కేశవ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులకు క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతపురం జిల్లాలో తల్లిపై దాడి..
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామంలో గురువారం దారుణం జరిగింది. కరకముక్కల గ్రామానికి చెందిన నాగవేణి, వీరభద్రయ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు అశోక్ చక్రవర్తి ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. 11 ఏళ్ల క్రితం వీరభద్రయ్య మృతి చెందాడు. అప్పటి నుండి కుమారుడి బాగోగులను తల్లి చూసుకుంటూ వచ్చింది.
కుమారుడు అశోక్ చక్రవర్తి చెడు వ్యసనాలకు బానిసై.. జల్సాలు తీర్చుకోవడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తూ వచ్చాడు. 22 ఎకరాల పొలం, ఇల్లును దౌర్జన్యంగా తన పేరును రాయించుకున్నాడు. అనంతరం ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అశోక్ చక్రవర్తి.. ఆమె చేతిని కిటికీ కడ్డీల మధ్య పెట్టి లాగి విరిచాడు.
చేతి మణికట్టుపై కోసీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుమారుడి దాడి నుంచి ప్రాణాలతో తప్పించుకున్న నాగవేణి.. రక్తం కారుతున్నా గాయాలతో నేరుగా పాల్తూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరింది. తన కుమారుడి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన నాగవేణిని ఉరవకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
కర్నూలు జిల్లాలో విషాదం..
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు వెంటే తల్లి కూడా అనంత లోకానికి వెళ్లిపోయింది. మరణంలోనూ కన్న ప్రేమ పెనవేసుకుపోయింది. దీంతో మద్దికెరలో విషాదఛాయలు అలుముకున్నాయి. కంటికి రెప్పలా చూసుకున్న కొడుకు కళ్లముందే కన్నుమూశాడు. దీన్ని తట్టుకోలేని కన్న పేగు విలవిల్లాడింది. కుమారుడి మరణంతో తల్లడిల్లిన తల్లి గుండె కూడా ఆగింది. కొడుకు, తల్లి మరణం ఆ ఇంట విషాదాన్ని నింపింది.
కర్నూలు జిల్లా మద్దికెర ఎస్సీ కాలనీకి చెందిన నారాయణమ్మ (80)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు (53) కొంత కాలంగా అనారోగ్యం బారిన పడి, చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని తల్లి మూడు గంటల వ్యవధిలోనే చనిపోయింది. గంటల వ్యవధిలోనే తల్లీ కుమారులు మృతిచెందడంతో.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)