పెళ్లికి నిరాకరించిందని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై కాల్పులు
09 May 2022, 18:32 IST
- నెల్లూరులో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రతీకాత్మక చిత్రం
పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో నెల్లూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అదే గ్రామానికి చెందిన యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన సురేష్‌రెడ్డి బెంగళూరులో, కావ్యరెడ్డి పూణేలోని ఐటీ కంపెనీలలో పని చేసేవారు. కోవిడ్ కారణంగా కొంత కాలంగా ఇద్దరు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. కావ్యను పెళ్లి చేసుకుంటానంటూ కొన్నాళ్లుగా సురేష్ వెంటపడుతున్నాడు. పెళ్లికి ఆమె నిరాకరించడంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న నిందితుడు తుపాకీతో కాల్చి చంపి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
తాటిపర్తి గ్రామానికి చెందిన కావ్యను వివాహం చేసుకుంటానంటూ అదే గ్రామానికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి కొంతకలంగా పెద్దలతో రాయబారం నడుపుతున్నా కావ్య నిరాకరిస్తూ వచ్చింది. ఆమెతో సురేష్ రెడ్డి పెళ్లి జరపాలంటూ సురేష్ బంధువులు సైతం రాయబారాలు నడుపుతున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో వివాహానికి అడ్డంకులు లేవనుకున్నా, యువతి నిరాకరించడంతో సురేష్ రెడ్డి కక్ష పెంచుకన్నాడు. ఇటీవల సురేష్ తల్లిదండ్రలు చేసిన పెళ్లి ప్రతిపాదనను యువతి కుటుంబీకులు సైతం తిరస్కరించారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన సురేష్ పక్కా ప్రణాళికతో సోమవారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై నేరుగా కాల్పులకు దిగాడు. ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో సురేష్ రెడ్డిని అడ్డుకునేందుకు కావ్య సోదరి ప్రయత్నించినా ఆమెను పక్కకు నెట్టేసి కాల్పులకు పాల్పడ్డాడు. మొదటి రౌండ్ కాల్పుల నుంచి కావ్య తప్పించుకున్నా, ఆ తర్వాత ఆమెను పట్టుకుని తలలో నేరుగా కాల్చడంతో కుప్పకూలిపోయింది.
కావ్యారెడ్డికి, సురేష్‌కు మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ఆమె పెళ్లికి నిరాకరించినట్లు మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. యువకుడి ప్రవర్తన నచ్చకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన వాడైనా సురేష్ రెడ్డి దుందుడుకు వైఖరితో ఉండటంతో కావ్య పెళ్లికి సుముఖత వ్యక్తం చేయలేదు. సురేష్ వయసు 34కాగా, కావ్య వయసు 22కావడంతో పెళ్లికి నిరాకరించిందని మృతురాలి బంధువులు తెలిపారు. పదేపదే సురేష్ రెడ్డి తల్లిదండ్రులతో రాయబారాలు పంపడంతో యువతికి ఇష్టమైతే తాము కూడా పెళ్లికి సిద్దమని చెప్పామని, ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి పాల్పడినట్లు వాపోయారు. నిందితుడు పలుమార్లు కావ్యను పెళ్లికోసం ఒత్తిడి చేసినా ఆమె ఒప్పుకోలేదని కోపం పెంచుకున్నాడని చెబుతున్నారు.
సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని నెల్లూరు ఎస్పీ విజయరావు చెప్పారు. కాల్పులకు పాల్పడిన తుపాకీ మేడిన్ యూఎస్ గా గుర్తించామని., నిందితుడికి చెందిన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
టాపిక్