Visakha Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు
27 October 2023, 8:19 IST
- Trains Cancelled: రైల్వే మరమ్మతుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను మూడ్రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి రాజమండ్రి,విజయవాడలకు ప్రయాణించే రైళ్లను రద్దు చేశారు.
రైళ్ల రద్దు
Trains Cancelled: రైల్వే మరమ్మతుల నేపథ్యంలో డబుల్ డెక్కర్ రైలును రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను మూడ్రోజుల పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో నేటి నుంచి పలు రైళ్లు రద్దయ్యాయి. డివిజన్ పరిధిలోని భద్రతా పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన రైళ్లలో ప్యాసింజర్ రైలు సహా, ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు ఉన్నాయి. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రాజమండ్రి - విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ రైలును (07466) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
శుక్ర,శని,ఆదివారాల్లో విశాఖ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467) కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.విశాఖపట్నం - విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడిచే డబుల్ డెక్కర్ (22701) రైలును 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. శుక్ర,శనివారాల్లో తిరుగు ప్రయాణమయ్యే డబుల్ డెక్కర్ రైలు కూడా అందుబాటులో ఉండదని పేర్కొన్నాయి.
26, 27, 28 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం- కిరండూల్ (18514) నైట్ ఎక్స్‌ప్రెస్ కొరాపుట్ స్టేషన్ నుంచి తిరిగి ప్రయాణం అవుతుంది.
హౌరా - జగ్దల్‌పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ టిట్లాగఢ్ నుంచి హౌరాకు తిరిగి ప్రయాణం అవుతుంది. భువనేశ్వర్-జగ్దల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447) కొరాపుట్ వరకు మాత్రమే ప్రయాణించి తిరిగి భువనేశ్వర్ చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.