Rains In Ap: పలకరించిన తొలకరి వాన.. విజయవాడలో భారీ వర్షం
08 June 2023, 7:45 IST
- Rains In Ap: ఎండలతో అల్లాడిపోతున్న జనానికి తొలకరి వానలు పలకరించాయి. జూన్ మొదటి వారం గడిచిపోతున్న తొలకరి జాడ లేక గత వారం పదిరోజులుగా జనం మలమల మాడిపోతున్నారు. గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ వర్షం మొదలు కావడంతో వాతావరణం మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌ను పలకరించిన తొలకరి జల్లులు
Rains In Ap: ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల మందకొడిగా కదలడం వల్ల వర్షాలు కురవడంలో ఆలశ్యమవుతోందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
ఉదయం సూర్యోదయం కాకముందే భానుడు భగ్గు మంటుడంతో జనం అల్లాడి పోతున్నారు. మే చివరి వారంలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టినా ఆ తర్వాత వాతావరణం మళ్లీ మారిపోయింది. తుఫాను ప్రభావంతో మే మూడో వారంలో కాస్త చల్లబడ్డట్టు కనిపించినా ఆ ప్రభావం నాలుగైదు రోజులు మాత్రమే కొనసాగింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో నైరుతి రుతుపవనాల రాక ఆలశ్యమైందని ఐఎండి ప్రకటించింది. జూన్ మొదట్లో రావాల్సిన రుతుపవనాలు నాలుగో తేదీన వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వారం గడిచినా రుతుపవనాల జాడ లేకుండా పోయింది. మరోవైపు సగటున 40డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఇళ్ళలో కూడా అల్లాడిపోతున్నారు.
జూన్ ప్రవేశించి వారం గడిచిపోయినా రుతుపవనాల జాడ లేకపోవడంతో రైతులు కూడా వ్యవసాయ పనులు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కృష్ణా డెల్టా కాల్వలకు లాంఛనంగా బుధవారం నీటిని విడుదల చేసినా పూర్తి స్థాయిలకు సాగు పనులకు విడుదల చేయలేదు. మరో 48గంటల తర్వాత కాని రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించవని వాతావరణ శాఖ తెలిపినా అనూహ్యంగా గురువారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. చల్లటి గాలులతో చిరు జల్లులు పలకరించాయి. ఎండ వేడి, ఉక్కపోతలతో అల్లాడిన జనాలకు ఊరటనిచ్చారు.
మరోవైపు గురువారం అనకాపల్లి జిల్లా నాతవరం, కాకినాడ జిల్లా కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని 229 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం123 మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉంటాయని, 202 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు ఎస్‌డిఎంఏ ప్రకటించింది.
బుధవారం ఏలూరు జిల్లా కామవరపుకోటలో 45°C, బాపట్ల జిల్లా కొప్పెరపాడులో 44.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏన్టీఆర్ జిల్లా చిలకల్లు, పెనుగ్రంచిపోలులో 44.3°C, ప్రకాశం జిల్లా కురిచేడు, అల్లూరి జిల్లా కొండైగూడెం, పల్నాడు జిల్లా జంగమేశ్వరంలో 44.2°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. అలాగే 5 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 87 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు.
గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.