తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Jagan: జగన్‌ను గౌరవించండి.. ఎమ్మెల్యేలకు, అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం

CBN On Jagan: జగన్‌ను గౌరవించండి.. ఎమ్మెల్యేలకు, అధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశం

Sarath chandra.B HT Telugu

21 June 2024, 10:58 IST

google News
    • CBN On Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి అమర్యాదలు జరగకూడదని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు, అధికారులకు స్పష్టం చేశారు. 
వైఎస్ జగన్మోహన్ అనే నేను అంటూ ప్రమాణం
వైఎస్ జగన్మోహన్ అనే నేను అంటూ ప్రమాణం

వైఎస్ జగన్మోహన్ అనే నేను అంటూ ప్రమాణం

CBN On Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్ అక్షర క్రమంలో ప్రమాణం చేయాల్సి ఉన్నా సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణం చేసిన వెంటనే జగన్‌ ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణం సందర్భంగా జగన్‌ సాధారణ సభ్యులతో పాటు ప్రమాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన సంఖ్యా బలం లేకపోవడంతో గేటు బయట దిగి కాలినడకనే సాధారణ సభ్యుల మాదిరి అసెంబ్లీ ప్రాంగణం లోపలకు రావాల్సి ఉంటుంది.

అయితే ప్రోటోకాల్‌ ఉండకపోయినా జగన్ వాహన శ్రేణిని అసెంబ్లీ ఆవరణ లోపలకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారని తమను శాసన సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ సభ ప్రారంబానికి ముందు చెప్పారు. ప్రతిపక్షం విషయంలో అధికార పార్టీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి బయల్దేరే ముందు స్పష్టం చేశారని తెలిపారు.

చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయొద్దని, శాసనసభలో రాగద్వేషాలకు తావు ఇవ్వొద్దని సిఎం చంద్రబాబు ఆదేశించారని, జగన్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని తమకు స్పష్టం చేశారని, ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని పయ్యావుల వివరించారు. సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణం తర్వాత జగన్‌కు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్టు పయ్యావుల చెప్పారు. ప్రమాణం విషయంలో వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. తాము ఎవరిపై కక్ష సాధింపుకు పాల్పడమన్నారు. 

మరోవైపు ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రమాణం చేశారు. తొలుత వైఎస్‌ జగన్‌ అనే అని పలికిన జగన్ తర్వాత జగన్మోహన్‌ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం చేశారు. అనంతరం సభ్యలకు అభివాదం చేస్తూ ప్రొటెం స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభ ప్రారంభానికి ముందే శాసనసభా ప్రాంగణానికి చేరుకున్న వైఎస్‌ జగన్ సభ ప్రారంభమైనా లోపలకు వె‌ళ్లలేదు. సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ప్రమాణం పూర్తి చేసుకుని సరిగ్గా తన పేరు పిలిచే సమయానికి  అసెంబ్లీలోకి ప్రవేశించారు. ప్రమాణం చేసిన వెంటనే సభలోకి వెళ్లకుండా తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. 

తదుపరి వ్యాసం