తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Assigned Lands Regularization: ఆ తేదీ నుంచి అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ.. ఆంక్షల తొలగింపు

Assigned Lands Regularization: ఆ తేదీ నుంచి అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ.. ఆంక్షల తొలగింపు

HT Telugu Desk HT Telugu

07 August 2023, 7:17 IST

google News
    • Assigned Lands Regularization: ఏపీలో అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల్ని కల్పించడంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2003 జులై 31కు ముందు కేటాయించిన భూములపై ఆంక్షల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. 
అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు గడువు
అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు గడువు (facebook)

అసైన్డ్ భూముల క్రమబద్దీకరణకు గడువు

Assigned Lands Regularization: అసైన్డ్‌ భూములపై ఆంక్షల్ని తొలగించే విషయంలో 20ఏళ్ల క్రితం మంజూరైన వాటిని లబ్దిదారులకు బదలాయించాలని నిర్ణయించారు. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ తేదీ 2023 జులై 31వ తేదీని ప్రామాణికంగా తీసుకుని 20 ఏళ్ల ముందు లబ్ధిదారులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను నిషిధిత జాబితా నుంచి తొలగించనున్నారు.

2003 జులై 31కి ముందు లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయి. ఈ మేరకు ఆదివారం భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ జి.సాయిప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. అసైన్డ్‌ భూములను నిషిద్ధ జాబితానుంచి తొలగించే ముందు అర్హుల పేర్లను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి వారం రోజుల వ్యవధితో అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం అర్హుల జాబితాలను జిల్లా రిజిస్ట్రార్లకు అందించాలని కలెక్టర్లకు సూచించారు.

జిల్లా గెజిట్‌లలో సైతం లబ్దిదారుల వివరాలను ప్రచురించాలని సూచించారు. ప్రస్తుతం 22-ఎ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908 ప్రకారం నిషిద్ధ జాబితాలో ఉన్న ఎసైన్డ్‌ భూములను తప్పించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఉత్తర్వుల్లో వివరించారు.

లంక భూములు, చెరువులు/వాగులు అసైన్డ్‌ భూముల పరిధిలోకి రావు. నిషిద్ధ జాబితా నుంచి అసైన్డ్‌ భూములను తప్పించే ముందు తీసుకోవాల్సిన చర్యలన్నీంటిని జిల్లా జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

భూముల రికార్డులను క్రమబద్దీకరించడంలో భాగంగా తాసీల్దార్లు ఇప్పటికే ఇంటి స్థలాలు/వ్యవసాయ సాగు కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను సర్వేనంబర్ల వారీగా గుర్తించారు. వీటి ఆధారంగా వీఆర్వోలు డీకేటీ రిజిస్టర్లు, 1బి, అడంగళ్లు, ఇతర రికార్డులను తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అసైన్డ్‌ భూములకు అసలు పట్టాదారులు/వారసుల ఆధీనంలో ఉన్నారో లేదో పరిశీలించడంతో పాటు వాటిని ఏ సంవత్సరంలో కేటాయించారో పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ వివరాల గుర్తింపునకు భూరికార్డులైన డీకేటీ రిజిస్టర్లు/ఎసైన్‌మెంట్‌ రిజిస్టర్లు/1బి రిజిస్టర్‌/అడంగల్‌/22-ఎ జాబితాతో పాటు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచుకోవాలి.

వీఆర్వోలు నమోదుచేసిన వివరాలను తహసీల్దార్లు పరిశీలించాలి. ఒకవేళ ఎవరివైనా వివరాలు రికార్డుల్లో నమోదు కాకుంటే వెంటనే భూపరిపాలన శాఖ ప్రధాన కార్యాలయంలోని అధికారుల దృష్టికి ఈ-ఫైల్‌ ద్వారా తీసుకెళ్లాలి. అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాక తుది జాబితాను ఆర్డీవో/సబ్‌ కలెక్టర్‌కు సమర్పించాలి.

తహసీల్దార్లు సమర్పించిన వివరాల్లో కనీసం ఐదు శాతం జాబితాలను ఆర్డీవో/సబ్‌కలెక్టర్లు తప్పనిసరిగా పునఃపరిశీలించాలి. జాయింట్‌ కలెక్టర్‌ నిశితంగా పరిశీలించాక ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపాలి. జిల్లా కలెక్టర్‌ పూర్తిస్థాయిలో పరిశీలించాక యాజమాన్య హక్కులు కల్పించేందుకు సిద్ధం చేసిన ఎసైన్డ్‌ భూముల లబ్ధిదారుల పేర్లను జిల్లా రిజిస్ట్రార్లకు సమర్పించాలి. అయితే ఈ మొత్తం ప్రక్రియ చేపట్టడానికి నిర్దిష్టమైన గడువును నిర్ణయించలేదు. ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది.

తదుపరి వ్యాసం