Hotel Manager Torture: రిసెప్షనిస్ట్‌కు హోటల్ మేనేజర్ వేధింపులు.. కేసు నమోదు
29 November 2023, 8:31 IST
- Hotel Manager Torture: హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసిన యువతిని ప్రేమ, పెళ్ళి పేరుతో లైంగిక వేధింపులకు గురి చేసిన హోటల్ మేనేజర్‌పై విజయవాడలో కేసు నమోదైంది.
రిసెప్షనిస్ట్‌కు హోటల్ మేనేజర్ వేధింపులు
Hotel Manager Torture: పెళ్లి చేసుకోకపోతే ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పరువు తీస్తానంటూ యువతిని వేధిస్తున్న ఓ హోటల్ మేనేజరుపై విజయవాడ శివార్లలోని పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నగరంలోని యనమలకుదురుకు చెందిన యువతి కొంతకాలం క్రితం నగరంలోని ఓ హోటల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేశారు. ఆ హోటల్‌లో మేనేజరుగా పనిచేసే పాపారావు పరిచయమయ్యాడు. ఒకే చోటు పనిచేస్తుండటంతో అతనితో స్నేహంగా మెలిగింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. ఆమె అంగీకరించక పోవడంతో అతని వేధింపులు ఎక్కువ అయ్యాయి.
పనిచేసే హోటల్లో యువతితో ఎవరు మాట్లాడినా ఆమెను అనుమానించడం, అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అతని తీరు నచ్చని యువతి దూరంగా ఉండటం ప్రారంభించింది.
యువతి తనతో మాట్లాడక పోవడాన్ని భరించలేని పాపారావు తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమెను పలుమార్లు బెదిరించాడు. కొద్ది రోజుల క్రితం విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో , పోలీసులు పాపారావుకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
పోలీసుల వార్నింగ్‌తో కొన్నాళ్లు వేధింపులు, బెదిరింపులు ఆపిన పాపారావు తిరిగి ప్రారంభించాడు. నవంబర్ 21వ తేదీన యనమలకుదురులోని ఆమె ఇంటికి వచ్చి వీరంగం చేశాడు. తన వద్దనున్న ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అల్లరి చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఆందోళనకు గురైన బాధితురాలు మంగళవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.