Ratha Saptami in Tirumala: ఒకే రోజు ఏడు సేవలు.. తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు
28 January 2023, 9:04 IST
- తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు
Ratha Saptami Celebrations in Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువీధులన్నీ శ్రీవారి నామస్మరణంతో మార్మోగుతుంది.
మరోవైపు రథసప్తమి సందర్భంగా తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. భక్తులకు ఎలాంటి భక్తులు రాకుండా చర్యలు తీసుకుంది. ఇవాళ వేకువజాము నుండి రాత్రి వరకు స్వామి వారు వివిధ వాహనాలలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకను తిలకించడానికి వేలాదిమంది భక్తులు తిరుమలకి రానున్న క్రమంలో… పటిష్టమైన చర్యలు తీసుకుంది.
- రథసప్తమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహిస్తారు.
- ఇవాళ తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు రద్దు చేయడమైనది. భక్తులు ఆ రోజున వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలి. విఐపి బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు మరియు దివ్యాంగులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది.
- రోజువారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.
- తిరుమలలోని గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్సు- 1, 2, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లు, మినీ అన్నప్రసాదం కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు పంపిణీ చేస్తారు.
- వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతో పాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు లక్ష మజ్జిగ ప్యాకెట్లు, రెండు లక్షల పానీయాలు, ఒక లక్ష పులిహోర ప్యాకెట్లతోపాటు 7-8 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేస్తారు.
- ప్రస్తుతం ఉన్న 230 కుళాయిలు, 178 డ్రమ్ములు కాకుండా మాడ వీధుల్లోని గ్యాలరీలలో 408 పాయింట్ల వద్ద తాగునీటి పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరం నుండి 130 మంది విద్యార్థులు సూర్యప్రభ వాహనంలో ఆదిత్య హృదయం పారాయణం చేస్తారు.
- దర్శన స్లాట్‌లను పాటించని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా అనుమతి ఇస్తారు.