Tirumala : తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా 2,068 ఆలయాల నిర్మాణం..-will bring anti drone technology in tirumala says ttd eo dharma reddy ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా 2,068 ఆలయాల నిర్మాణం..

Tirumala : తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ.. శ్రీవాణి ట్రస్టు ద్వారా 2,068 ఆలయాల నిర్మాణం..

HT Telugu Desk HT Telugu
Jan 23, 2023 04:44 PM IST

Tirumala : తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భద్రత అంశంలో పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో వివిధ ప్రాంతాల్లో 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి (facebook)

Tirumala : తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాల పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో వైరలై.. కలకలం సృష్టించిన నేపథ్యంలో... తిరుమల తిరుపతి దేవస్థానం... పటిష్ఠ చర్యలకు పూనుకుంది. ఇప్పటికే వీడియో వైరల్ చేసిన సంస్థపై కేసు నమోదు చేసిన టీటీడీ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా... తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు... టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డు నుంచి అన్నదానం కాంప్లెక్స్ వరకు సర్వే చేయడానికి ఐవోసీకి అనుమతి ఇచ్చామని... వారు అత్యుత్సాహంతో ఆలయ పరిసరాల్లో డ్రోన్ తో చిత్రీకరించారని తేలితే చర్యలు తప్పవని చెప్పారు. డ్రోన్ వీడియోపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. యూట్యూబ్ నుంచి తిరుమల డ్రోన్ దృశ్యాలు తొలగించామని తెలిపారు. తిరుమలలో భద్రతా చర్యల అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ మేరకు వివరించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతోన్న ఆలయాల నిర్మాణం వివరాలను వెల్లడించారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో కలిపి మొత్తం 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి)ను 2019లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. లక్ష రూపాయల లోపు విరాళం అందించే దాతలకు కూడా ప్రయోజనాలు వర్తింపచేయాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించే దాతలకు ఒక బ్రేక్‌ దర్శన టికెట్‌ జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు.

శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు దాతల నుండి రూ. 650 కోట్ల విరాళాలు సమకూరాయని ధర్మారెడ్డి తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో 2019వ సంవత్సరానికి ముందు 502 ఆలయాలు నిర్మించినట్టు వెల్లడించారు. అనంతరం ఈ ఫౌండేషన్‌ సహకారంతో 320 ఆలయాల నిర్మాణానికి రూ.32 కోట్ల శ్రీవాణి నిధులు మంజూరుచేశామని, వీటిలో 110 ఆలయాలు ఒకనెలలో, 210 ఆలయాలు 6 నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో వెనుకబడిన ప్రాంతాల్లో 932 ఆలయాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు కేటాయించామని, దశలవారీగా ఇప్పటివరకు రూ.25 కోట్లు మంజూరుచేశామని వివరించారు.

అదేవిధంగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 150 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇందుకోసం రూ.130 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.71 కోట్లు విడుదల చేశామని తెలియజేశారు. ఈ విధంగా 1402 ఆలయాల నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. మరో 667 ఆలయాల నిర్మాణానికి వినతులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వీటిని ఖరారు చేసి నిర్మాణాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేస్తామని, ఇందుకోసం రూ.12.50 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకు గాను ప్రతినెలా రూ.2 వేలు ఆలయ కమిటీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్టు వివరించారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టీటీడీ బృందం తరచూ తనిఖీ చేస్తుందని తెలిపారు.

కాగా, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి 50 శాతం నిధులను టీటీడీ జనరల్‌ అకౌంట్‌కు బదిలీ చేస్తున్నారని, ఆదాయం కోసమే శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తున్నారని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉందని, అందులోనే విరాళాలు జమ అవుతాయని చెప్పారు. టీటీడీ నుంచి సొమ్ము ప్రభుత్వానికి అందే ప్రసక్తే లేదన్నారు. మరింత ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్‌ దర్శన టికెట్లను 1000కి తగ్గించడం జరిగిందన్నారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్‌లో, 250 టికెట్లు ఆఫ్‌లైన్‌లో రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నట్టు చెప్పారు.

Whats_app_banner