Nara Lokesh : చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారు, నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
28 October 2023, 13:23 IST
- Nara Lokesh : సీఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా జైలులో నిర్బంధించారని నారా లోకేశ్ ఆరోపించారు. స్కిల్ కేసులో ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
నారా లోకేశ్
Nara Lokesh : రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నారా లోకేశ్, భువనేశ్వరి శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు కాబట్టే 10 ఏళ్లుగా బెయిల్ పై బయట ఉన్నారన్నారు. వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది కాబట్టే ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా, పోలీసులను అడ్డుకుందని ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారన్నారు. చంద్రబాబు ప్రాణానికి ముప్పు ఉందనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలన్నారు.
నా తల్లిని అరెస్టు చేస్తామంటున్నారు
"అధికార పార్టీ వైసీపీ నేతలు వ్యక్తిగత కక్షతో చంద్రబాబును చనిపోవాలని కోరుకుంటున్నారు. వైసీపీ ఎంపీ బహిరంగంగానే చంద్రబాబును చంపేస్తామని చెబుతున్నారు. జైలులోనే చనిపోతారని అంటున్నారు. కేసుతో సంబంధంలేని నా తల్లి భువనేశ్వరిని జైలుకు పంపిస్తామంటున్నారు. 50 రోజులుగా కేసు విచారణలో ఒక కొత్త విషయానైనా బయటపెట్టారా? స్కిల్ సెంటర్లు అన్ని నడుస్తున్నాయని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు. చంద్రబాబు ఏ తప్పుచేయలేదు. మేం అన్ని ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. మా అకౌంట్లలో ఒక్క రూపాయి అవినీతి సొమ్ము చూపించలేకపోయారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు."- నారా లోకేశ్
వ్యక్తిగత కక్షతో అరెస్టులు
చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు జైల్లో బంధించారని లోకేశ్ ఆరోపించారు. నా తల్లి నిజం గెలవాలి అని యాత్ర చేపడితే ఆమెను కూడా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మంత్రులు అంటుంటే ఇది వ్యక్తిగత కక్ష కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించడానికి 10 కోట్లు లాయర్ ఫీజుకు ప్రభుత్వం ఖర్చుపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, వారిని ఆదుకునేందుకు ఒక్క మీటింగ్ లేదన్నారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగితే పట్టించుకోరు కానీ, బస్సు యాత్ర పేరుతో గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతకు దారివ్వలేదని బస్సును ఆపి డ్రైవర్ దింపి చావచితక బాదారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పింది చేస్తేనే ఏపీలో బతకనిస్తారని, లేకపోతే జైలులో పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు బయటపెట్టాలని లోకేశ్ సవాల్ విసిరారు.