తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh : జ‌గ‌న్‌ పాల‌న‌లో సామాజిక అన్యాయం, ప్రజ‌ల‌పై మోయ‌లేని భారం- నారా లోకేశ్

Nara Lokesh : జ‌గ‌న్‌ పాల‌న‌లో సామాజిక అన్యాయం, ప్రజ‌ల‌పై మోయ‌లేని భారం- నారా లోకేశ్

23 October 2023, 20:39 IST

google News
    • Nara Lokesh : నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో సామాజిక అన్యాయం జరిగిందని నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన మరోసారి కలిసి సాగాలని నిర్ణయించుకున్నాయన్నారు.
నారా లోకేశ్
నారా లోకేశ్

నారా లోకేశ్

Nara Lokesh : విజయదశమి రోజున టీడీపీ-జ‌న‌సేన క‌ల‌యిక రాష్ట్రానికి మేలు చేయ‌నుంద‌ని, వ‌చ్చేది టీడీపీ-జ‌న‌సేన ప్రభుత్వమేన‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. 2014లో రాజ‌ధాని కూడా లేని న‌వ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని న‌డిపించేందుకు స‌మ‌ర్థుడైన నాయ‌కుడు కావాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ టీడీపీకి మ‌ద్దతు ఇవ్వగా ప్రభుత్వం ఏర్పడి, అనేక సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోస‌మే టీడీపీ-జ‌న‌సేన మ‌రోసారి క‌లిసి సాగాల‌ని నిర్ణయించుకున్నాయ‌ని ప్రక‌టించారు. నాలుగున్నరేళ్ల జ‌గ‌న్‌ పాల‌న‌లో సామాజిక అన్యాయం జ‌రిగింద‌న్నారు. వైసీపీ పాల‌కులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల‌కి తీరని ద్రోహం చేశార‌ని ఆరోపించారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నార‌ని, బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశార‌న్నారు. ద‌ళిత డాక్టర్ సుధాక‌ర్ నుంచి డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యం వ‌ర‌కూ ఎంద‌రో ఎస్సీల‌ని వైసీపీ స‌ర్కారు వెంటాడి వేధించి చంపేసింద‌న్నారు.

రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీది 3వ స్థానం

ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఇస్లాంలో ఆత్మహ‌త్య పాపం అని, వైసీపీ నేతల వేధింపులు తాళ‌లేక‌ ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నార‌ని ఆందోళ‌న‌ వ్యక్తం చేశారు. తీవ్ర క‌రవుతో 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా రైతుల్ని ఆదుకునే చ‌ర్యలు వైసీపీ స‌ర్కారు తీసుకోలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంద‌న్నారు. ప్రాజెక్టులు మూల‌న‌ప‌డ్డాయ‌ని, మిగులు జ‌లాలు స‌ముద్రంలో క‌లిశాయ‌ని, రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. డీజిల్ పెట్రోల్ ధ‌ర‌లు, క‌రెంటు ఛార్జీలు, ప‌న్నులు విప‌రీతంగా పెంచేసి ప్రజ‌ల‌పై మోయ‌లేని భారం వేశార‌ని లోకేశ్ మండిప‌డ్డారు. అధికారంలోకి వ‌స్తే 2.50 ల‌క్షల ప్రభుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్, సీఎం అయ్యాక ఉన్న ఉద్యోగాలు ఊడ‌గొడుతున్నార‌ని ఆరోపించారు.

నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ

నాలుగున్నరేళ్ల వైసీపీ పాల‌న‌లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేద‌ని, ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నార‌ని లోకేశ్ ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ‌రు మాట్లాడినా వేధిస్తున్నార‌న్నారు. ప్రజ‌ల స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం, అరాచ‌క స‌ర్కారుపై ప్రజ‌ల త‌ర‌ఫున పోరాడేందుకు టీడీపీ-జ‌న‌సేన క‌లిశాయ‌ని, నవంబరు 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామ‌న్నారు. ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలన ఉంటుంద‌న్నారు. నవంబరు 1 నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామ‌న్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ, అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని, రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని 3 తీర్మానాలు చేశామ‌ని ప్రక‌టించారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి పాటుప‌డుతుంద‌న్నారు.

తదుపరి వ్యాసం