తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Janasena Meet : రాజమండ్రిలో టీడీపీ, జనసేన సమావేశం ప్రారంభం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ

TDP Janasena Meet : రాజమండ్రిలో టీడీపీ, జనసేన సమావేశం ప్రారంభం, ఉమ్మడి కార్యాచరణపై చర్చ

23 October 2023, 16:37 IST

google News
    • TDP Janasena Meet : టీడీపీ, జనసేన సమన్వయ సమావేశం రాజమండ్రిలో ప్రారంభం అయింది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 14 మంది సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం
టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం

టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం

TDP Janasena Meet : రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల తొలి సమన్వయ సమావేశం ప్రారంభం అయింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం, ఉమ్మడి కార్యాచరణపై రెండు పార్టీలు చర్చిస్తున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీల సమన్వయంపై ఇరు పార్టీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేషన్, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్‌, పలవలసాల యశశ్విని హాజరయ్యారు.

పవన్, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ

ఈ సమావేశానికి ముందు రాజమండ్రి టీడీపీ క్యాంపు ఆఫీసులో టీడీపీ సభ్యులతో లోకేశ్ భేటీ అయ్యారు. జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించే అంశాలపై మాట్లాడారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా సమన్వయ సమావేశం జరిగే హోటల్ మంజీరాకు లోకేశ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పవన్ కల్యాణ్ గన్నవరం నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా హోటల్ మంజీరాకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. జనసేన-టీడీపీ భేటీ అనంతరం పవన్ కల్యాణ్, లోకేశ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం వీరిద్దరూ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడనున్నారు.

చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్

ఈ సమావేశానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతో నారా లోకేశ్‌ ములాఖత్ అయ్యారు. ఈ ములాఖత్ లో జనసేనతో సమన్వయ కమిటీ సమావేశం, అందులో చర్చించే అంశాలను లోకేశ్ చంద్రబాబుకు వివరించారు. కరవు, కృష్ణా జలాల పంపిణీ పునః సమీక్షతో పాటు పలు ప్రజా సమస్యలపై చర్చించినట్లు లోకేశ్‌ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు వంటి అంశాలపై దృష్టి సారించాలని చంద్రబాబు లోకేశ్‌కు సూచించారని సమాచారం. క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ-జనసేన కమిటీల ఏర్పాటుపైనా చంద్రబాబుతో లోకేశ్ చర్చించారు.

తదుపరి వ్యాసం