తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Letter : త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం, జైలుగోడ‌లు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు- చంద్రబాబు

Chandrababu Letter : త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం, జైలుగోడ‌లు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు- చంద్రబాబు

22 October 2023, 21:38 IST

google News
    • Chandrababu Letter : న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే అని చంద్రబాబు అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోంచి తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ రాశారు.
చంద్రబాబు బహిరంగ లేఖ
చంద్రబాబు బహిరంగ లేఖ

చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Letter : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఓట‌మి భయంతో నన్ను జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి తెలుగు ప్రజ‌ల‌కు న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారని, నేను ప్రస్తుతం ప్రజ‌ల మ‌ధ్యలో లేక‌పోవ‌చ్చు కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తానని చంద్రబాబు అన్నారు. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి తన పేరే త‌లుస్తారన్నారు. ప్రజ‌ల్నించి ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా తనను దూరం చేయ‌లేరన్నారు. నేను జైలులో లేను, ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. త‌న‌కు ప్రజ‌ల‌తో ముడిప‌డిన అనుబంధాన్ని లేఖ‌లో చంద్రబాబు వివ‌రించారు. ములాఖ‌త్‌లో భాగంగా తనను క‌లిసిన కుటుంబ‌ స‌భ్యుల‌కు తెలుగు ప్రజ‌ల‌ను ఉద్దేశించి తాను రాసిన లేఖను చంద్రబాబు అంద‌జేశారు.

జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు

"నేను జైలులో లేను. మీ అంద‌రి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైత‌న్యంలో ఉన్నాను. విధ్వంస పాల‌న‌ని అంతం చేయాల‌నే మీ సంక‌ల్పంలో ఉన్నాను. ప్రజ‌లే నా కుటుంబం. జైలు గోడ‌ల మ‌ధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా క‌ళ్ల ముందు కదలాడుతోంది. నా రాజ‌కీయ ప్రస్థాన‌మంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓట‌మి భయంతో నన్ను జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్రజ‌ల‌కి దూరం చేశామ‌నుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవ‌చ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజ‌ల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా న‌న్ను దూరం చేయ‌లేరు. కుట్రల‌తో నాపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్రయ‌త్నించారు కానీ.. నేను న‌మ్మిన విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ని ఎన్నడూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమ‌బ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడ‌లు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచ‌లు న‌న్ను ప్రజ‌ల్నించి దూరం చేయ‌లేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను."- చంద్రబాబు

చెడు గెలిచినా నిలవదు

ఈ దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజ‌మ‌హేంద్రవ‌రం మహానాడులో ప్రకటించానని చంద్రబాబు తెలిపారు. అదే రాజ‌మ‌హేంద్రవ‌రం జైలులో న‌న్ను ఖైదు చేశారన్నారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తానన్నారు. నా ప్రజ‌ల కోసం, వారి పిల్లల భ‌విష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. ఎప్పుడూ బ‌య‌ట‌కు రాని ఎన్టీఆర్ బిడ్డ, నా భార్య భువ‌నేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజ‌ల్లోకి వెళ్లి నా త‌ర‌ఫున పోరాడాల‌ని నేను కోరానని, అందుకు ఆమె అంగీక‌రించారన్నారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతిచెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించాలని, 'నిజం గెల‌వాలి' అంటూ మీ ముందుకు వ‌స్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. జ‌న‌మే నా బ‌లం, జనమే నా ధైర్యం అన్న చంద్రబాబు... దేశ‌విదేశాల‌లో నా కోసం రోడ్డెక్కిన ప్రజ‌లు వివిధ రూపాల్లో మ‌ద్దతు తెలుపుతున్నారన్నారు. న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే అన్నారు. మీ అభిమానం, ఆశీస్సుల‌తో త్వర‌లోనే బయటకి వ‌స్తానని చంద్రబాబు తెలిపారు. అంత‌వ‌ర‌కూ వైసీపీ పాల‌న‌పై శాంతియుత పోరాటం కొన‌సాగించాలని కోరారు. చెడు గెలిచినా నిల‌వ‌దు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాల‌ప‌రీక్షలో గెలిచి తీరుతుందన్నారు. త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం సాధిస్తుందని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు లేఖపై స్పందించిన జైలు అధికారులు

చంద్రబాబు రాసిన లేఖపై జైలు అధికారులు స్పందించారు. చంద్రబాబు బహిరంగ లేఖ జైలు నుంచి జారీ చేసింది కాదని పోలీసులు తెలిపారు. జైలు నియమావళి ప్రకారం జైలు నుంచి ఎవరైనా సంతకం చేసిన కరపత్రాలు బయటకు విడదల చేయాలంటే, వాటిని ముందుగా జైలు అధికారులు పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అలాంటి కరపత్రాన్ని జైలర్ పరిశీలించి ధ్రువీకరించి, సంతకం, జైలు ముద్రతో సంబంధిత కోర్టులకు, లేక ప్రభుత్వ శాఖలకు, వారి కుటుంబ సభ్యులకు పంపుతామని స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చంద్రబాబు లేఖకు జైలుకు ఎలాంటి సంబంధం లేదని రాజమండ్రి జైలు పర్యవేక్షణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు.

తదుపరి వ్యాసం