Chandrababu Arrest : నారా బ్రహ్మణితో జనసేన నేతలు భేటీ, ఉమ్మడి నిరసన కార్యక్రమాలపై చర్చ
24 September 2023, 14:21 IST
- Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన నేతలు నారా బ్రాహ్మణితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
నారా బ్రహ్మణితో జనసేన నేతలు భేటీ
Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణితో జనసేన నేతలు భేటీ అయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన నేతలు నారా బ్రహ్మణితో సమావేశమై సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. జనసేన నేత కందుల దుర్గేష్, మాజీ మంత్రి చినరాజప్ప ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రెండు పార్టీలు ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు నిరసగా తెలుగు రాష్ట్రాలతో సహా పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఏపీ సరిహద్దు గరికపాడు వద్ద శనివారం రాత్రి నుంచే భారీగా పోలీసులను మోహరించి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలను తనిఖీ చేశాకే ఏపీలోకి అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుకు మద్దతుగా చలో రాజమండ్రికి పిలుపునిచ్చిన ఐటీ ఉద్యోగులకు ఏపీలోకి అడుగు పెట్టే అర్హత లేదంట అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వందలాది మంది పోలీసులను రంగంలోకి దింపి తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్ భయపడుతూ పడుకున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇది పాకిస్తాన్ బోర్డర్ కాదు, ఏపీ సరిహద్దు అంటూ గరికపాడు వద్ద భారీగా పోలీస్ బందోబస్తు వీడియోను షేర్ చేసింది.
రెండో రోజు చంద్రబాబు విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు సీఐడీ విచారణ చేస్తుంది. తొలి రోజు మాదిరిగానే ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారుల బృందం కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలులోని కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు సమక్షంలో సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు కారు ర్యాలీకి పిలుపు నిచ్చిన సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.