Chandrababu Remand : చంద్రబాబుకు షాక్, అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు
24 September 2023, 18:47 IST
- Chandrababu Remand : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది.
చంద్రబాబు
Chandrababu Remand : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియడంతో... ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు... చంద్రబాబు రిమాండ్ ను అక్టోబరు 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలన్న సీఐడీ అధికారుల విజ్ఞప్తితో ఏకీభవించిన ఏసీబీ జడ్జి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు
ఆదివారం సాయంత్రంతో చంద్రబాబు రెండ్రోజులు సీఐడీ కస్టడీ ముగిసింది. కస్టడీ ముగిసిన వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును తన ముందు హాజరుపర్చాలని ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు వద్దకు సీఐడీ, చంద్రబాబు తరపు న్యాయవాదులు చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వర్చువల్ గా చంద్రబాబును జడ్జి ముందు హాజరుపర్చారు. చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలని సీఐడీ న్యాయవాదులు కోరడంతో... అందుకు ఏసీబీ కోర్టు అంగీకరించింది. అక్టోబర్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. అయితే చంద్రబాబును సీఐడీ కస్టడీ ఇవ్వాలని మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు జరుగనున్నాయి.
మరో 11 రోజుల రిమాండ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ నెల 9న చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఏసీబీ కోర్టు చంద్రబాబు సెప్టెంబర్ 24 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. రెండ్రోజుల సీఐడీ కస్టడీకి కోర్టు అంగీకరించింది. నేటితో చంద్రబాబు రిమాండ్, సీఐడీ కస్టడీ ముగియడంతో ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను మరో 11 రోజులు పొడిగించింది. అయితే తనపై తప్పుడు కేసులు పెట్టారని, వాటిని కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. క్వాష్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు సీఐడీ వాదనలతో ఏకీభవించి చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసింది. తాజాగా హైకోర్టు తీర్పు చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కొనసాగుతున్న నిరసనలు
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా కార్ల ర్యాలీ చేపట్టారు. అయితే కార్ల ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా కొందరు ఐటీ ఉద్యోగులు రాజమండ్రి చేరుకుని నారా బ్రహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. అలాగే విశాఖ ఆర్కే బీచ్ లో మహిళలు ర్యాలీ చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా జనసేన నేతలు రాజమండ్రిలో నారా బ్రహ్మణితో భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిరసనలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.