Daggubati Purandeswari: ఏపీలో మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలన్న పురందేశ్వరి
18 September 2023, 11:50 IST
- Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం మరణాలపై సిబిఐ విచారణ జరగాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమాలపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అధికార పార్టీ దోపిడీని ప్రజలకు వివరిస్తామని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు, మద్యం ఇండెంట్లు, మద్యం కంపెనీల సరఫరా మొత్తం తాడేపల్లి కనుసన్నల్లో జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. రూ.300కోట్ల రుపాయలు నేరుగా తాడేపల్లి చేరుతోందనే సమాచారం తమకు ఉందన్నారు.
క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం ఏపీ జనాభాలో 35శాతం మద్యం సేవిస్తారని, కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 15శాతం మద్యం సేవిస్తారని, కేంద్రం అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 80లక్షల మంది రోజుకు రూ.200 రుపాయల మద్యం సేవిస్తే వాటి ద్వారా రోజుకు రూ.160కోట్లు వస్తాయని, నెలకు రూ.4800కోట్లు, ఏడాదికి రూ.56,600కోట్లు వస్తాయని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం 20వేల కోట్ల రుపాయలు మాత్రమే లెక్కలు చూపిస్తున్నారని, మిగిలిన రూ.25వేల కోట్లు ఏమవుతున్నాయని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అనధికారికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, గ్రామాల్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు నేరుగా ఇళ్లలోనే అమ్ముకునేలా చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలకు మించిన కుంభకోణం ఏది ఉండదని దీనిపై విచారణ జరగాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. లిక్కర్ బాండ్ల ద్వారా రూ.10వేల నిధులు సేకరించారని, అందులో ఉన్న నిబంధనల్లో మద్యం పాలసీ మార్చేది లేదని, నిషేధం విధించనని అంగీకరించారని గుర్తు చేశారు. ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని పురందేశ్వరి మండిపడ్డారు.
2019లో సిఎంగా జగన్ పగ్గాలు చేపట్టాక మద్యంపై ఆదాయాన్ని తగ్గించి, రిహబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, 2024నాటికి మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంచి, ఎన్నికలకు వెళతానని జగన్ ప్రకటించారన్నారు.గ్రామాల్లో ఆర్వో ప్లాంట్ లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారని, తెల్లారకముందే మద్యం దుకాణాలు ప్రారంభిస్తున్నారని విమర్శించారని, ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు మాత్రం మద్యం యదేచ్ఛగా విక్రయిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో 29 హోల్‌సేల్ ఔట్‌లెట్స్ 2900దుకాణాలకు మద్యం బేవరేజీస్ కార్పొరేషన్ సరఫరా చేస్తోందని, ఐఎంఎఫ్‌ఎల్ యాక్ట్‌లో తమకు అనుగుణంగా మార్చేసుకున్నారని మండిపడ్డారు.
మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తానని జగన్ చెప్పారని, మద్యం, ఆరోగ్యం గురించి మాట్లాడారని మద్యంలో ఎంత అవినీతి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఉన్న బ్రాండ్లు ఇప్పుడు కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయని , రకరకాల కొత్త పేర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారని ఆరోపించారు.
అగ్రోస్, ఎస్పీవై అగ్రోస్, బయోటెక్, చిత్తూరులో మోహన్ బెవరేజిస్, విశాఖలో జిఎస్పీ వంటి సంస్థలు మద్యం తయారు చేస్తున్నాయని, గతంలో ఉన్న సంస్థలను బెదిరించి వాటిని వారి నుంచి లాక్కున్నారని, కేసులు పెడతామని బెదిరించి వాటిని తమ పార్టీ వారికి కట్టబెట్టారన్నారు.
వైసీపీ ఎంపీకి కష్టాలు తప్పలేదు….
అధికార పార్టీ ఎంపీ ఒకరు తన కంపెనీ ప్రభుత్వానికి ఇవ్వను అన్నందుకు అతని కంపెనీ మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. ఎక్కడైనా మొలాసిస్‌కు ఈస్ట్ కలిపి తయారయ్యే రెక్టిఫైడ్ స్పిరిట్ శుద్ధిచేసి వాటికి రంగులు, ఎసెన్స్‌లు కలిపి, తర్వాత నీటిని కలిపి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం తయారు చేయిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మాత్రం ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలను వేరు చేయకుండా నేరుగా తయారు చేస్తున్నారన్నారు. రూ.15రుపాయలతో తయారయ్యే లీటర్ మద్యాన్ని రూ.600నుంచి వెయ్యి రుపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు.
2019లో 16-18వేల కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు రూ.32వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోందన్నారు. మద్యం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉందని, ఏపీబెవరేజీస్ కార్పొరేషన్ ప్రత్యేక పన్నులు వసూలు చేసి, వాటిని చూపించి బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారని చెప్పారు. బేవరేజీస్ కార్పొరేషన్ పేరుతో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటున్నారని, సంక్షేమ విడతలో భాగంగా అమ్మఒడి, ఆసరా, చేయూత కార్యక్రమాలకు అవసరమైన నిధుల్ని బేవరేజీస్ కార్పోరేషన్ ద్వారా ఇవ్వాలని చెబుతున్నారని ఆరోపించారు.
కుటుంబాలు చిద్రమై, మహిళల పుస్తెలు తెగినా, కుటుంబాలు నాశనమై పోయినా శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మండిపడ్డారు. చీప్ లిక్కర్ తయారీ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు.
ప్రజల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మద్యం దుకాణాలు, ఆస్పత్రుల్ని పరిశీలిస్తే తేలుస్తుందని, గుండె జబ్బులు, లివర్ సిరోసిస్, అనారోగ్యంతో ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వం చేసే హత్యలేనని ఆరోపించారు. చీప్ లిక్కర్ తాగడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పురందేశ్వరి ఆరోపించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను పరిశీలించారా..?
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, రూ.371 కోట్ల రుపాయల అవినీతి స్కిల్ డెవలప్‌మెంట్ లో అవినీతి జరిగిందని, నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన నేపథ్యంలో అవినీతిని తాము సమర్థించడం లేదని, విచారణ జరిపే క్రమంలో ఉన్న లోపాలు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రతి సెంటర్‌లో 100కంప్యూటర్లు, జర్మనీ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కావాల్సిన పరికరాలను రెండు జిల్లాల్లో 54 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సిఐడి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు వెళ్లి విచారించారా లేదా అనేది తేల్చాలన్నారు. అవినీతిని ఏ రూపంలో సమర్థనీయం కాదని, ప్రజా ధనం దుర్వినియోగం చేయలేదని, సొంతంగా వాడుకోలేదని, ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే వారని, రైళ్లలో ప్రయాణించే వారని, చార్టర్డ్ ఫ్లైట్‌లో తిరిగే వారు 118 నంబరు ఫియట్ కారులో తన తండ్రి తిరిగే వారని పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అవినీతి యథేచ్ఛగా కొనసాగుతోందని, అవినీతి భాగోతానికి కర్త, కర్మ, క్రియ అధికార పార్టీయేనని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో నిబంధనల మేరకు వ్యవహరించడంలో తలెత్తిన లోపాలపై మాత్రమే అభ్యంతరం చెబుతున్నానన్నారు.