తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Garbage Tax : ఏపీలో చెత్త సేకరణ పన్ను రగడ....!

Garbage tax : ఏపీలో చెత్త సేకరణ పన్ను రగడ....!

HT Telugu Desk HT Telugu

24 July 2022, 8:55 IST

google News
    • ఆంధ్రప్రదేశ్‌లో చెత్త సేకరణ పన్ను వసూలు వ్యవహారం ముదురుతోంది.  ప్రజల నుంచి బలవంతంగా పన్ను సేకరణకు ప్రయత్నించడంపై  ప్రజాప్రతినిధుల నుంచి  సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజా పన్ను వసూలు నిలిపివేయాలని కడపలో కార్పొరేటర్లు వినతి పత్రం సమర్పించారు. 
చెత్త పన్ను వసూలుపై జనాగ్రహం
చెత్త పన్ను వసూలుపై జనాగ్రహం

చెత్త పన్ను వసూలుపై జనాగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్ను వసూలు వ్యవహారం రగడ జనాగ్రహానికి కారణమవుతోంది. ప్రజల నుంచి బలవంతంగా చెత్త సేకరణ పన్నును వసూలు చేస్తుండటంతో ప్రజా ప్రతినిధులకు ఆ సెగ తగులుతోంది.

చెత్తసేకరణ పన్నుతో ఏపీలో కొత్తగా వసూలు చేస్తున్న పన్నుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నివాసాలు, వాణిజ్య ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి నుంచి చెత్త పన్నులు వసూలు ప్రారంభించారు. గత మార్చి నుంచి పన్ను వసూళ్లు ప్రారంభించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.

చెత్త సేకరణ కోసం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్‌కు రూ.120 చెత్త పన్నుగా వసూలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో రూ.30 వసూలు చేస్తున్నారు. రోడ్డు పక్కన పెట్టుకునే బడ్డీలు, తోపుడు బళ్లకు రూ.200 వరకు పన్నుగా నిర్ణయించారు. చిన్న తరహా రెస్టారెంట్లకు నెలకు రూ.500, సినిమా థియేటర్లకు రూ.2500, ఫైవ్‌ స్టార్ హోటళ్లకు రూ.15వేలు, హోల్‌సేల్ దుకాణాలకు రూ.200 వసూలు చేస్తున్నారు.

వాణిజ్య సంస్థల్ని మినహాయిస్తే నివాస ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా పన్ను వసూలు చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మురికి వాడల్లో రూ.30, ఇతర ప్రాంతాల్లో రూ.120గా పన్ను నిర్ణయించి బలవంతంగా వసూలు చేస్తున్నారు. పన్ను వసూళ్లకు సంబంధించి ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. మొబైల్‌లో మెసేజ్ వస్తుందని చెబుతున్నా చాలా సందర్భాల్లో చెత్త పన్ను ప్రభుత్వానికి చేరిందో లేదో కూడా అంతుచిక్కడం లేదు.

ప్రభుత్వం పంచాయితీలు మొదలుకుని కార్పొరేషన్‌ల వరకు ప్రతి నెల ఇంటి పన్ను, ఆస్తి పన్ను వసూలు చేస్తుండగా మళ్లీ చెత్త సేకరణకు ప్రత్యేకంగా పన్ను వసూలు చేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తడిచెత్త, పొడిచెత్తల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోందని పురపాలక శాఖ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అపార్ట్‌మెంట్లలో ఇంటింటి చెత్త సేకరణ సాధ్యపడదు.

ఎవరి చెత్తను వారే డస్ట్‌బిన్లలో వేయడమో, పని వాళ్లతో వేయించడమో చేస్తారు. అయినా ప్రభుత్వానికి పన్ను చెల్లింపు మాత్రం తప్పట్లేదు. ఇక చెత్త సేకరణకు తడి, పొడి చెత్తల్ని వేరు చేసే ప్రక్రియ కూడా సమర్ధవంతంగా జరగట్లేదు. గతంలో మాదిరే ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజల జేబుకు చిల్లు పడటం తప్ప చెత్తపన్నుతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదనే విమర్శలున్నాయి.

మరోవైపు కడపలో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేయాలంటూ కార్పొరేటర్లు మేయర్‌కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. పన్ను వసూళ్లపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. క్లాప్‌ పథకం ద్వారా సేవలు అందకపోయినా అమల్లోకి వచ్చిన తేదీ నుంచి పన్ను చెల్లించాలని సచివాలయ సిబ్బంది ప్రజల్ని ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమైంది. పన్ను వసూళ్ల సెగ కార్పొరేటర్లను తాకడంతో వారంతా వారంతా మేయర్‌కు మొరపెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితి నెలకొని ఉంది. పన్ను వసూళ్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో విపక్షాలతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం