తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Property Tax: ఏపీలో నాలుగేళ్లలో 75శాతం పెరిగిన ఆస్తి పన్నులు, కాంపౌండ్ వసూళ్లు ఆపాలని జనం డిమాండ్..

AP Property Tax: ఏపీలో నాలుగేళ్లలో 75శాతం పెరిగిన ఆస్తి పన్నులు, కాంపౌండ్ వసూళ్లు ఆపాలని జనం డిమాండ్..

10 October 2024, 14:51 IST

google News
    • AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను లెక్కింపు విధానాన్ని ఆస్తి కేపిటల్ విలువ ఆధారంగా లెక్కించే పద్ధతికి మార్చడంతో నాలుగేళ్లలో దాదాపు 75శాతం పన్నులు పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ రద్దు చేసి, ఆస్తి పన్ను ఏటా 15 శాతం చొప్పున కాంపౌండింగ్ తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  
ఏపీలో ఏటా పెరుగుతోన్న ఆస్తి పన్ను భారాన్ని చంద్రబాబు తగ్గిస్తారా?
ఏపీలో ఏటా పెరుగుతోన్న ఆస్తి పన్ను భారాన్ని చంద్రబాబు తగ్గిస్తారా?

ఏపీలో ఏటా పెరుగుతోన్న ఆస్తి పన్ను భారాన్ని చంద్రబాబు తగ్గిస్తారా?

AP Property Tax: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నులో ఏటా 15 శాతం పెంచేలా జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం నిలిపి వేసి, ఆస్తి పన్ను సవరణ చట్టం 44/2020 ని రద్దు చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అద్దెవిలువ మీద ఆస్తిపన్ను లెక్కించే విధానాన్ని రద్దుచేసి, ఆస్తి కేపిటల్‌ విలువ మీద ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని 2020లో ప్రవేశ పెట్టింది. దీని కోసం మున్సిపల్‌ చట్టాలకు సవరణ చేస్తూ సవరణ చట్టం 44/2020 ని తెచ్చింది.

ఏపీలో ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువ మారినప్పుడల్లా ఆస్తి పన్ను కూడా మారే విధంగా సవరణ చట్టంలో నిబంధన విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా అప్పట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో ఏటా 15శాతం చొప్పున పన్నులు పెరుగుతూనే ఉన్నాయి.

స్టాంప్‌ డ్యూటీ వసూలు కోసమే ఆస్తి విలువ..

  • సాధారణంగా ఆస్తి కేపిటల్‌ విలువను ఆస్తుల క్రయ, విక్రయాలు చేసినపుడు ప్రభుత్వానికి రావాలసిన స్టాంపు డ్యూటీని నిర్ణయించటం కొరకు రూపొందిస్తారు. ఆస్తి పన్ను నిర్ధారణ కోసం గతంలో ఎప్పుడూ దీనిని వినియోగించలేదు.
  • తనకున్న ఆస్తిని యజమాని నేరుగా అనుభవించటం ద్వారా కాని లేదా ఇతరులకు అద్దెకు ఇచ్చి అద్దెను అనుభవించటం ద్వారా కాని యజమాని లబ్ధి పొందుతాడు. ఇక్కడ ఆస్తిని నేరుగా అనుభవించినా లేక అద్దెకు ఇచ్చినా, సదరు ఆస్తి పై హక్కు యజమానికే ఉంటుంది. దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అందువలన ఆ ఆస్తి యజమానికి ఉపయోగపు విలువ (Use Value)ను మాత్రమే ఇస్తుంది. మారకపు విలువ (Exchange Value)ను ఇవ్వదు.
  • ఆస్తిని అమ్మినప్పుడు మాత్రమే అందుకు భిన్నంగా కేపిటల్‌ విలువ ముందుకొస్తుంది. ఆస్తిని అమ్మినపుడు మాత్రమే కేపిటల్‌ విలువ ద్వారా యజమాని లబ్ది పొందుతాడు. ఆస్తిని అమ్మితే కేపిటల్‌ విలువ యజమాని చేతులలోకి వస్తే, ఆస్తిపై హక్కు కొన్నవాడి చేతులలోకి పోతుంది.
  • ఆస్తిపై ఉండే హక్కు, కేపిటల్‌ విలువ రెండూ ఒకరి చేతులలోనే ఉండవు. ఒక వ్యక్తే ఏక కాలంలో రెండూ అనుభవించే అవకాశం ఉండదు. కారణం ఆస్తిపై హక్కు, కేపిటల్‌ విలువ పరస్పరం మారకం చెందుతాయి. ఇక్కడ ఆస్తి మారకపు విలువ ను ఇస్తుంది. అందువలన కేపిటల్‌ విలువ అనేది మారకపు విలువ (Exchange Value) మాతమ్రే అవుతుందని పన్ను చెల్లింపుదారులు గుర్తు చేస్తున్నారు.
  • సహేతుకంగా లేని పన్నుల వసూళ్లు…
  • పన్ను ఆస్తిని అనుభవిస్తున్నప్పుడు చెల్లించేదిగా ఉండాలి. ఆస్తిని కోల్పోయినందుకు చెల్లించేది కాదు. ఆస్తి, యజమాని స్వాధీనంలో ఉంటే, ఆ ఆస్తిని నేరుగా తాను వియోగించుకోవటం ద్వారా కాని లేదా వేరొకరికి అద్దెకు ఇచ్చి ప్రతిఫలంగా అద్దె డబ్బును తీసుకొని అనుభవించటం కానీ చేస్తాడు. ఈ రెండు విధానాలలో ఏదో విధంగా యజమాని అనుభవిస్తున్నప్పటికీ, ఆస్తి యజమాని హక్కు క్రిందనే ఉంటుంది. ఆస్తిపై హక్కును, ఆస్తిపై ప్రయోజనాన్ని ఏకకాలంలో అనుభవిస్తాడు. ఆస్తిని ఏదోరూపంలో అనుభవిస్తున్నాడు కనుక అనుభవ విలువ లేదా ఆస్తిపై వచ్చే అద్దెవిలువపై ఆస్తిపన్ను లెక్కించటం సరైంది.
  • ఆస్తిని అమ్మినప్పుడు కేపిటల్‌ విలువ ( మారకపు విలువ) అమ్మిన వారి చేతికి వెళ్లిపోతాయి. అమ్మినవారు కేపిటల్‌ విలువను పొందటం వలన చట్ట ప్రకారం కేపిటల్‌ గైన్సు పన్ను (Capital Gains Tax) చెల్లిస్తున్నారు. అదే సమయంలో అమ్మిన వారు ఆస్తి మీద హక్కును కోల్పోతున్నారు. ఆస్తిమీద హక్కును కొన్న వారికి బదిలీ అవుతుంది.
  • ఆస్తి హక్కుతోబాటే, ఆస్తిపన్ను చెల్లించే బాధ్యత కూడా కొన్నవాడికి బదలీ అవుతాయి. కేపిటల్‌ విలువ, ఆస్తిపన్ను చెల్లించే బాధ్యత రెండూ ఒకరివద్దే ఉండవు. ఆస్తిని అమ్మకుండానే అమ్మితే ఎంతవస్తుంది అనేదానిని లెక్కించి పన్ను విధించటం అంటే కేపిటల్‌ విలువ మీద ఆస్తిపన్ను లెక్కించటమేనని చెబుతున్నారు.

ఏటా పెరిగే పన్నులతో ప్రజలపై భారం పడుతుండటంతో ఆస్తిపన్ను సవరణ చట్టాన్ని 2020 చేసినపుడే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత ప్రభుత్వం ఈ ఆంధోళనలు పట్టించుకోలేదు. ఈ చట్టం అమలు చేయటం కోసం రూల్సును రూపొందిస్తూ 2020నవంబర్ 24న జీవో నెంబరు 198 ని తీసుకు వచ్చారు.

ఈ జీవో ప్రకారం ఆస్తి పన్నును ఏటా 15 శాతం కాంపౌండింగ్‌ రూపంలో పెంచుతున్నారు. జీవో 198 ప్రకారం గత నాలుగేళ్లలో 75 శాతం ఇళ్ళ పన్నులు పెరిగాయి.

గిఫ్ట్‌గా ఇచ్చినా బాదుడే…

చివరకు ఆస్తిని తండ్రి, కొడుకు పేర గిఫ్ట్ గా రాసినా, గిఫ్ట్‌ గా రాసిన తేదీన ఉన్న కేపిటల్‌ విలువ ప్రకారం ఇంటిపన్ను విధిస్తున్నారు. కేవలం రికార్డులలో పేరు మారినందుకు పన్ను పెరుగుతోంది.

అప్పు చేయటం కోసం అనుమతి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు అనుగుణంగా ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏటా పెంచుతున్న 15 శాతం ఆస్తి పన్ను పెంపుదలను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నిలిపి వేయవలసిందిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్ చేసింది. ఆస్తి కేపిటల్‌ విలువ మీద ఆస్తి పన్నును లెక్కించే విధానం కొరకు చేసిన ఆస్తిపన్ను సవరణ చట్టం 44/2020 ను రద్దు చేసి, అద్దె విలువ ఆధారంగా ఇంటిపన్నును లెక్కించే పాతపధ్ధతిని పునరుధ్దరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

తదుపరి వ్యాసం